విజయవాడ: అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని శుక్రవారం రవాణా శాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆ శాఖకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను అడిగి తెలు సుకున్నారు. చెక్‌పోస్టులను పునరుద్ధరించి కరెన్సీ, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాను నిరోధించాలని సూచించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నిషేధం.. అక్రమ రవాణాను అరికట్టేలా చర్యలు తీసుకోవడంపై చర్చించారు. స్మగుల్ గూడ్స్/ప్రజా పంపిణీ సరుకుల అక్రమ రవాణా నియంత్రణ, సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు, చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయడం, రవాణా శాఖలో నష్టాన్ని నియంత్రించి ఆదాయం పెంచడం, అంత రాష్ట్ర రవాణా ఒప్పందాలు, విభజన సమస్యలు ఏవైనా ఉంటే వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే అంశాలపై సూచనలు చేశారు. పాఠశాలలు, కళాశాలల వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను సంబంధిత అధికారులు ర్యాండమ్‌గా తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాద రహిత రాష్ట్రంగా చేయడం, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లపై తనిఖీలు నిర్వహించి పొరపాట్లు ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించారు.