పాలకొల్లు: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా, మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి మండలం అడవిపాలెంలో అనారోగ్యానికి గురయిన లారీ డ్రైవర్‌కు తొలి పెన్షన్ అందించి కాళ్లకు నమస్కరించారు. ఇదే గ్రామానికి చెందిన పెదపాటి భాగ్యలక్ష్మి కాళ్లు కడిగి పెన్షన్ అందజేశారు. అలాగే పాలకొల్లులో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని మంత్రి తెలిపారు. టీడీపీ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఈ క్రమంలో ఆయన వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగి నగదు అందజేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.