- సభా మర్యాద విస్మరిస్తే ఎలాగని ప్రశ్న
- ఇది కౌరవ సభ కాదంటూ దెప్పిపొడుపు
- చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తిస్తానని ప్రకటన
- విధివిధానాలపై కొత్తవాళ్లకు శిక్షణనిస్తామని హామీ
అమరావతి (చైతన్య రథం): మాజీ సీఎం జగన్‌కు కనీసం సభా మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడూ చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమన్నారు. శుక్రవారంనాటి పరిణామాల్లో వైసీపీ పార్టీ నేతలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కేశవ్ ప్రత్యేకంగా సమాచారం అందించినా.. జగన్, అతని ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం వారికి సభపట్ల ఎలాంటి మర్యాద ఉందనేది స్పష్టం చేస్తుందన్నారు. అది గ్రహించే ప్రజలు జగన్ స్థానమేమిటో చూపించారని కఠినంగా వ్యాఖ్యానించారు. సభకు వచ్చి సంప్రదాయాలను గౌరవించి, ప్రజా సమస్యలను లేవనెత్తి మాట్లాడితే జగనుకే మంచిదని హితవు పలికారు. తాము మాత్రం సభా గౌరవాన్ని ఇనుమడిరచి చూపిస్తామని అయ్యన్నపాత్రుడు పునరుద్ఘాటించారు. ఇది కౌరవ సభ కాదు. ఈ సభకు హుందాతనం ఉందని అంటూనే, గత సభలో వాళ్లు కౌరవుల్లా వ్యవహరించారని మండిపడ్డారు.
అందరి సహకారంతో సభను సజావుగా నడిపి హుందాతనాన్ని, సభా గౌరవాన్ని పెంచుతామని 16వ అసెంబ్లీ సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సభాపతి స్థానం అధిష్టించిన అనంతరం అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అసెంబ్లీలో వివిధ మీడియా సంస్థలపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా గత పాలకులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఆ నిషేధాన్ని తొలగించామని స్పష్టం చేశారు.
బాధ్యతలు విస్మరించను..
స్పీకర్ పదవి బాధ్యతతో కూడుకున్నదని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆ బాధ్యతలు విస్మరించుకుండా సమర్ధవంతంగా నిర్వహించి సభా గౌరవాన్ని పెంచుతామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు ఈ సభలో కన్నీళ్లు పెట్టిన రోజే వైసీపీ పతనం ప్రారంభమైందని చెప్పామన్నారు. అందుకనే వై నాట్ 175 అంటే దేవుడు, ప్రజలు కలిసి 11 స్థానాలు ఇచ్చి పక్కన పెట్టేశారని చెప్పుకొచ్చారు. చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా వైసీపీ నేతలు అడిగారన్న ఒకే ఒక్క పరిశీలనతో చంద్రబాబు ఔదర్యంగా వ్యవహరించారని చెప్పారు. ఆయన వాహనాన్ని ప్రధాన ద్వారం వద్దకు అనుమతించారన్నారు. మంత్రులు తర్వాత జగన్‌తో ప్రమాణం చేయించిన విషయాన్ని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 16వ శాసన సభలో కొత్తగా ఎంపికైన సభ్యుల సంఖ్య ఎక్కువగానే ఉందని, అసెంబ్లీలో జరిగే డిబేట్లపై అవగాహన కల్పించడమే కాకుండా, శిక్షణ ఇప్పించేందుకూ చర్యలు తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, నియమ నిబంధనలేమిటి? మాట్లాడే తీరు, సాంకేతిక విధి విధానాలపైనా కొత్త సభ్యులను రాటుదేలిస్తే.. భవిష్యత్‌కు సమర్థమైన నాయకులు లభిస్తారని అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.