అమరావతి (చైతన్య రథం): సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు 16వ అసెంబ్లీలో సభాపతి స్థానానికి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ప్రభుత్వంలో ముఖ్యమంతి తరువాత, శాసన సభలో కీలక పదవి సభాపతే. సీనియారిటికి ప్రాధాన్యమిచ్చి స్పీకర్ పదవికి అయ్యన్నను ఎంపిక చేశారు. అయ్యన్నపాత్రుడు ఒక్కరే స్పీకర్ పోస్ట్‌కు అప్లై చేయడంతో ఏకగ్రీవమైంది. తెలుగుదేశం పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ఇప్పటికే కీలకమైన మంత్రి పదవులు చేపట్టి.. మరో అడుగు ముందుకేసి ఇప్పుడు స్పీకర్ చైర్లో ఆశీనులయ్యారు. యుక్త వయసులోనే అన్న ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అయ్యన్న.. రాజకీయ కురువృద్ధుడిగా పార్టీ వర్గాల్లో పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా పేరుబడిన ఉత్తరాంధ్ర బీసీ నేత.. ఇప్పుడు సభాపతి స్థానాన్ని అధిష్టించి శాసన సభకే నిండుదనం తెచ్చారు. 1957 సెప్టెంబర్ 4న వరహాలు దొర దంపతులకు చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖపట్టణం జిల్లా నర్సిపట్నంలో జన్మించారు. ప్రాథమిక విద్యను పుట్టిన ఊరు నర్సిపట్నంలో పూర్తి చేసిన అయ్యన్న, కాకినాడ పీఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. అయ్యన్నపాత్రుడి భార్య పేరు పద్మావతి. ఈ దంపతులకు విజయ్, అజయ్ అనే ఇద్దరు కుమారులు.
రాజకీయ ప్రస్థానం
నందమూరి తారక రామారావు పిలుపుతో చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో నర్సీపట్నం అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్రతిహతంగా సాగిన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు పదిసార్లు పోటీ చేసి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అయ్యన్న. నర్సీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు. 1983, 1985లో నర్సీపట్నం నుంచి వరసగా రెండుసార్లు గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణమూర్తి రాజు చేతిలో ఓడిపోయారు. 1994, 1999, 2004లో వరసగా మూడుసార్లు విజయం సాధించారు. 2009లో బోలెం ముత్యాల పాప చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో అయ్యన్నపాత్రుడు గెలుపొందారు. 2019లో పెట్ల ఉమాశంకర్ గణేశ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్ నాయకుడిగావున్న అయ్యన్నను గత ప్రభుత్వం దారుణమైన ఇబ్బందులకు గురి చేసింది. ఈసారి గెలవడంతో ఏడుసార్లు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన నేతగా ఆయనపై ఆయనే రికార్డు సృష్టించుకున్నారు.
మంత్రిగా నాలుగుసార్లు
అయ్యన్నపాత్రుడు నాలుగుసార్లు మంత్రి పదవులను నిర్వహించారు. 1984లో విద్యాశాఖ మంత్రిగా, 1994లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డునూ బీటీ రోడ్డుగా మార్చిన ఘతన ఆయనదే. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. 1999లో చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ ఔషధ మొక్కల పంపకం కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. 2014లోనూ మంత్రిగా పనిచేశారు. 16వ లోక్‌సభలో అత్యంత సీనియర్ నాయకుడిగావున్న అయ్యన్నకు సభాపతి స్థానాన్నిస్తే.. గౌరవ సభకే గౌరవం దక్కుతుందన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రులు, ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవ నిర్ణయంతో శనివారం అయ్యన్ననే సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అయ్యన్నపాత్రుడు ఎంతో కృషి చేశారు.