అమరావతి: ఏపీలో పింఛన్ లబ్ధిదారులు జూలై నెలలో రూ.7 వేల చొప్పున అందుకోనున్నారు. ఈ మేరకు జీవో విడుదలయింది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటైన పింఛన్ల పెంపునకు సంబంధించిన ఫైలుపై గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతకం చేశారు. ప్రస్తుతం రూ. 3 వేల పెన్షన్ అందిస్తుండగా ఇకపై రూ.1000 పెంచి రూ. 4 వేలు అందించనున్నారు. ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది.
ఒక్కొక్కరికి రూ. 7 వేలు
తాము అధికారంలోకి వస్తే పెంచిన పింఛన్‌ను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జులై 1న ఒక్కొక్కరికి రూ. 7 వేల చొప్పున పెన్షన్ అందిస్తారు. ఏప్రిల్, మే, జూన్‌లో చెల్లించాల్సిన వెయ్యి రూపాయలతోపాటు జులై నెల పింఛన్ రూ. 4 వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు అందిస్తారు. ఆగస్టు నుంచి మాత్రం రూ. 4 వేల చొప్పున పంపిణీ చేస్తారు.
రూ. 4 వేల పెన్షన్ అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులు ఉన్నారు.
దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 3 వేలు ఇస్తుండగా, ఇకపై రూ. 6 వేలు ఇవ్వనున్నారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, అనారోగ్యంతో మంచానపడి లేవలేని స్థితిలో ఉన్నవారికి, వీల్‌చైర్‌లో ఉన్న వారికి ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 5 వేల పెన్షన్ స్థానంలో ఇకపై రూ. 15 వేలు అందిస్తారు. అలాగే, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేయించుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ. 5 వేల పింఛనుకు బదులు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కుష్ఠువ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి రూ. 6 వేలు ఇస్తారు.