- ఐదేళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలియదు
- మంత్రి పదవి రానందుకు చింతించడంలేదు
రాజమహేంద్రవరం: మళ్లీ ప్రజల్లోకి రావాలని వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యంగ్యంగా స్పందించారు. జగన్ చేసిన నిర్వాకానికి మళ్లీ జనంలోకి వస్తే రాళ్లు, చెప్పులు వేస్తారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బూతులు తిట్టేవాళ్లను నెత్తిన పెట్టుకుని తిరిగే జగన్ మోహన్ రెడ్డి ఇవాళ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ ను వదిలి ఏనాడైనా ప్రజల్లోకి వచ్చావా అని ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత జగన్ చంచల్ గూడ జైల్లో ఉంటాడో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. నాడు తండ్రిని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కొంతే… ఈ ఐదేళ్లలో అంతకు 10 రెట్లు ఎక్కువ దోచుకున్నాడని గోరంట్ల ఆరోపించారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుందని, దోషులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. హత్యా రాజకీయాలు, దోపిడీకి పాల్పడిన జగన్ శిక్షకు అర్హుడు అని స్పష్టం చేశారు.
ఇక తనకు మంత్రి పదవి రాకపోవడంపైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఈసారి టీడీపీ… జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుందని… పొత్తు ధర్మం ప్రకారం సీట్ల సర్దుబాటు, మంత్రిపదవుల సర్దుబాటు తప్పదని, కొన్ని సామాజిక సమీకరణాలు కూడా చూసుకున్న మీదట తనకు మంత్రి పదవి రాలేదని వెల్లడిరచారు. అందుకు తానేమీ చింతించడంలేదని తెలిపారు. మంత్రి పదవి వస్తుందని నా వరకు నేను ఆశించాను… రాజకీయ కెరీర్ ఆఖరి దశలో గుర్తింపు వస్తుందని భావించాను. అయినా… మంత్రి పదవి రాకపోతే ఏమవుతుంది? ఇదివరకు పదవి ఉంటేనే పని చేశామా? నాలుగు పర్యాయాలు రాజమండ్రిలో ఏ పదవి ఉంటే పనిచేశాను? రాజమండ్రి రూరల్ లో మూడు పర్యాయాలు ఏ పదవి ఉంటే పనిచేశాను? పదవులు ముఖ్యం కాదు… పనిచేయడం ముఖ్యం. అయితే పదవి ఉంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయని గోరంట్ల అన్నారు.