అమరావతి: పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. కొంతమంది పోలీసు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మార్పు రాకపోతే తామే మారుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు, వారు స్వేచ్ఛగా తిరగవచ్చని అన్నారు. హోం మంత్రిత్వ శాఖ కేటాయించిన అనంతరం శుక్రవారం మంత్రి అనిత మాట్లాడుతూ… మాచర్లలో చంద్రయ్య హత్య లాంటి కేసులను రీ ఓపెన్ చేస్తాం, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అక్రమ కేసులు అన్నింటిపై కూడా సమీక్ష తప్పని సరిగా ఉంటుందని స్పష్టం చేశారు.
చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా శాసనసభ వేదికగా కించపరిచారని మండిపడ్డారు. చంద్రబాబు ఈ సంఘటనతో కన్నీటి పర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కన్నీటితో రాష్ట్రంలో రాజకీయంగా ఉప్పెన వచ్చిందన్నారు. అందుకే ప్రజలు ఇలాంటి ఫలితాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలన రావాలని, శాంతిభద్రతలు బాగుండాలనే కోరుకునే ఆయనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను, ఏ విధంగా చంపేశారో చూశామన్నారు. విశాఖలో వారి కుటుంబ సభ్యులను కూడా వెళ్లి కలుస్తానని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, మహిళలు, సామాన్య ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. తనకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని వంగలపూడి అనిత పేర్కొన్నారు.