అమరావతి(చైతన్యరథం): పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాటెట్లపై వైసీపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తూ, మోసపూరిత ప్రకటనలు చేస్తోందన్నారు. పోస్టల్‌బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధించి స్పష్టత ఇస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఇచ్చిన మెమోపై వైసీపీ నేతలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిని ఉపసంహరించుకునే పరిస్థితి వచ్చినప్పటికీ నిస్సిగ్గుగా సీఈఓపై విషం చిమ్ముతున్నారు. సీఈఓ చెప్పిన దానినే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేయటంతో తొలుత సీఈఓ ఇచ్చిన మెమోను వెనక్కు తీసుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. ఇందులో వాస్తవాలు దాచేసి సీఈఓ మెమో వెనక్కు తీసుకోవటాన్ని హైలైట్ చేస్తూ, పెద్ద విజయం సాధించినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని అశోక్‌బాబు తప్పుబట్టారు.
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సీఈఓ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై అనుమానాలున్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా టీడీపీ నేతలు మొదటినుంచీ సీఈఓను కలుస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పై కొన్ని చోట్ల స్టాంపులు, సీళ్లు వేయలేదని ఈ సందర్భంగా మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాము. పోస్టల్ బ్యాలెట్ వెనుక కొన్ని చోట్ల ఆర్‌ఓ సంతకం లేదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వాటిని వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించాలి. ఈ నిబంధన గతంలోనే ఉన్నప్పటికి కూడా ప్రస్తుత అధికారులకు మళ్లీ స్పష్టంగా సర్క్యులర్ ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. లేకుంటే పోస్టల్ బ్యాలెట్ పనిచేయకుండా పోయే పరిస్థితి ఉందని సీఈఓ దృష్టికి మేము తీసుకువెళ్లాము. దీంతో పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను యధాతథంగా వివరిస్తూ ఆయన తాజాగా మెమో ఇచ్చారు. దానిపై వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సడలింపులు ఇచ్చారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. నీలిమీడియాలో దుష్ప్రచారాన్ని హోరెత్తించారు. వాస్తవానికి సీఈఓ సడలింపులు ఇవ్వలేదు. ఉన్న నిబంధనలపై స్పష్టత మాత్రమే ఇచ్చారు. తన సొంత నిర్ణయాలేమీ లేవని, కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిన మేరకు చేశానని సీఈఓ చెప్పారు. వైసీపీ నేతలు హైకోర్టులో దీనిపై కేసు వేశారు. కేసు వేసిన వెంటనే కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఏపీ సీఈఓ లేఖ రాసి దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా.. అటెస్టేషన్ ఫారమ్ 13 మీద అటెస్టేషన్ ఆఫీసర్ సంతకం పెట్టి సీలు, స్టాంప్ వేయకపోయినా ఆ బ్యాలెట్ ని తిరస్కరించడానికి వీలు లేదు, వాటన్నింటిని లెక్కింపులోకి తీసుకోవాలని తెలుపుతూ సీఈఓకు లేఖ రాసింది. ఆ లేఖను సీఈఓ కోర్టుకు సమర్పించటంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. దీంతో సీఈఓ ఇచ్చిన మెమోపై దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేస్తామని వైసీపీ నేతలు అడగటంతో కోర్టు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈఓ నిర్ణయమే చట్టబద్ధంగా నిలబడుతుంది. వైసీపీవారి కుటిల ప్రయత్నాలు కచ్చితంగా వికటిస్తాయని అశోక్‌బాబు స్పష్టం చేశారు.