- ఎగ్జిట్‌పోల్ అంచనాలు
హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి 9 స్థానాల్లో విజయ దుందుభి మోగించబోతోందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు భాజపా కూడా ఇదే స్థాయిలో స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నాయి భారాస 0-1 సీట్లకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఆరా, ఇండియా టీవీ, పీపుల్స్ పల్స్, ఏబీపీ-సీ ఓటర్, ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సంస్థలు కాంగ్రెస్, భాజపా మధ్య నువ్వానేనా అని పోటీ ఉన్నట్లు తేల్చాయి. జన్‌కీ బాత్ మాత్రం భాజపాకు అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొంది. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు చెప్పడం గమనార్హం.
2019 ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను భారాస 9 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. భాజపా 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించాయి. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలు తామే సాధిస్తామని కాంగ్రెస్ మొదటి నుంచీ ధీమాతో ఉంది. అయితే భాజపా అనూహ్యంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన స్థానాల కన్నా ఈసారి ఏమాత్రం తగ్గవని భారాస భావించింది. అయితే, మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.