- నేటి పోలింగ్‌పై వార్ రూం నుంచి జిల్లాల్లోని నేతలతో సమీక్ష
- ఓటమి భయంతో వైసీపీ అక్రమాలకు పాల్పడే అవకాశం
- చివరి ఓటు వరకూ అప్రమత్తంగా ఉండాలి
- పలువురు నేతలకు వివిధ విభాగాల సమన్వయ బాధ్యతలు అప్పగింత
అమరావతి(చైతన్యరథం): పోలింగ్ శాతం పెరిగేలా ప్రయత్నించాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. సోమవారం జరిగే పోలింగ్‌పై పార్టీ జాతీయ కార్యాలయంలోని వార్ రూం నుంచి ఆదివారం చంద్రబాబు జిల్లాల్లోని పార్టీనేతలతో సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియపై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేశారు. రేపటి పోలింగ్‌పై తీసుకోవాల్సిన చర్యలపై అటు పార్టీ నేతలకు, ఇటు వార్ రూం బృందానికి చంద్రబాబు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్ రూంలో వివిధ విభాగాల సమన్వయం కోసం విడివిడిగా బాధ్యతలు అప్పగించారు. గ్రామ స్థాయిలో పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని మానిటర్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గాల్లో పోలింగ్‌లో తలెత్తే సమస్యలపై ఎప్పటికప్పుడు సెంట్రల్ వార్‌రూంకు సమాచారం వచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ లెటర్లు, పుకార్లు, హింసా రాజకీయాలతో వైసీపీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పోలింగ్‌లో ఏవైనా సమస్యలు వస్తే జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అబ్జర్వర్ల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా తక్షణ చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఏజెంట్లుగా వెళ్లే వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పోలింగ్ శాతం పెరిగేలా పార్టీ తరుపున ప్రయత్నం చేయాలని సూచించారు. ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని…..ఓటర్లు స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా ఓటు వేసే పరిస్థితిని కల్పించాలని నేతలకు చంద్రబాబు చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ ఊహంచని స్థాయి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, చివరి ఓటు పోల్ అయ్యేవరకు పూర్తి స్థాయి అప్రమత్తతో పనిచేయాలని ఆదేశించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు గ్రామంలో కార్యకర్త నుంచి పార్టీ కార్యాలయంలో నేతల వరకు ఏ ఒక్కరూ ఆదమరుపుగా ఉండరాదన్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం చంద్రబాబు పార్టీ కార్యాలయంలోని వార్ రూంకు వస్తారు. సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు వార్ రూం నుంచి పర్యవేక్షిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉండవల్లిలో ఓటు వేయనున్న చంద్రబాబు, కుటుంబసభ్యులు
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి ఉండవల్లిలో ఓటుహక్కు వినియోగించుకుంటారు. సోమవారం ఉదయం 7.00 గంటలకు ఉండవల్లిలోని గాదె రామయ్య – సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో చంద్రబాబు, కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు.