- మైనారిటీలపై జగన్ నిజస్వరూపం, వాస్తవాల పేరిట మరో కరపత్రం
- శుక్రవారం మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఈ కరపత్రాలు పంచాలని నిర్ణయం
- జగన్ నిజస్వరూపాన్ని ముస్లింలకు మతపెద్దలు తెలియజెప్పాలని పిలుపు
అమరావతి రాజధానితోనే ముస్లింల సంక్షేమం, భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో ఓటు రూపంలో వచ్చిన అవకాశాన్ని ప్రతి ముస్లిం సోదరుడు సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు, మౌలానా నయీం ఉర్ రెహ్మాన్ ఖాన్ రషాద్మి, ఆంధ్ర, తెలంగాణ జమియత్ ఉలేమ్మా ఎ హింద్, ముస్లిం మైనారిటీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు తెలిపారు. బుధవారం నాడు తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ‘అమరావతితోనే ముడిపడి ఉన్న ముస్లింల భవిష్యత్తు’ అనే కరపత్రాన్ని, మైనారిటీలపై జగన్ నిజస్వరూపం, వాస్తవాలు అంటూ.. ఇచ్చింది నవరత్నాలు కాదు నవమోసాలు అంటూ మరో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు మౌలానా నయీం ఉర్ రెహ్మాన్ ఖాన్ రషాద్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ముస్లింలకు జగన్ నిజ స్వరూపాన్ని, ప్రజా రాజధాని అమరావతి ఆవశ్యకతను తెలియజేయాల్సిన బాధ్యత ముస్లిం మతపెద్దలపై ఉందన్నారు. రాష్ట్రంలో సుఖసంతోషాలు, శాంతిభద్రతలు, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపారులకు వాణిజ్య వసతులు, చేతివృత్తుల వారికి చేతినిండా పని లభించాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్రంలో ఉన్న ప్రతి మసీదు వద్ద ఈ రెండు కరపత్రాలు పంచాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల రాష్ట్ర అధ్యక్షులు ఫరూఖ్ షిబ్లి, ముస్తి ఫారూఖ్, మౌలానా అబ్దుల్ జబ్బార్, హఫీజ్ అబ్దుల్ హమీజ్, మౌలానా ఇస్హాస్ మదని, తదితరులు పాల్గొన్నారు.