- బీసీ హత్యాకాండలో నేరస్తులను శిక్షిస్తా
- నేనున్నా.. అక్రమ కేసులకు భయపడొద్దు
- ఐదేళ్లుగా బటన్ నొక్కడం వినా ఏం చేశాడు?
- భూములు కొల్లగొట్టడానికే కొత్త చట్టం తెచ్చారు
- ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టో
- లిఫ్ట్‌లు పెట్టయినా దెందులూరుకు తాగునీరు
- కూటమి అభ్యర్థులను గెలిపించాలని వినతి
- దెందులూరు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
- సభకు పోటేత్తిన జనసందోహం
దెందులూరు (చైతన్య రథం): బీసీలను ఊచకోత కోసి హత్యలకు పాల్పడిన వైకాపా గూండాలను ఉపేక్షించేది లేదని, అధికారంలోకి రాగానే శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలాగే తెలుగుదేశం శ్రేణులను అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టినవారికి భవిష్యత్‌లో వడ్డీ సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు తీవ్రస్వరంతో హెచ్చరించారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా మంగళవారం దెందులూరులో నిర్వహించిన భారీ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మీద 43 అక్రమ కేసులు బనాయించారు. నాపైనా కేసులు పెట్టారు. మేము ప్రజల కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనిచేస్తూనే ఉంటాం. మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా నిలుస్తాం. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఎవరూ తప్పుడు కేసులకు భయపడొద్దు’ అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. ‘నా మంచితనాన్నే ఇప్పటివరకు చూస్తున్నారు. రానున్న కాలంలో కఠినత్వాన్ని కొంతమంది చూడబోతున్నారు. నాయకుడికి నాయకత్వ పటిమ, దూరదృష్టి, సమర్థవంతమైన పరిపాలనపై పట్టు ఉండాలి. ఫలితాలు సాధించేవాడు, సుపరిపాలన అందించేవాడే నాయకుడు’ అని బాబు వ్యాఖ్యానించారు. చింతమనేనిమీద అభిమానం విజిల్స్‌కే పరిమితం చేయకుండా, ఓట్లుగా మలచుకోవాలని బాబు సూచించారు. కొద్ది గంటలముందే జనసేనాని పవన్‌కల్యాణ్, బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్‌తో కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టో అదిరిపోయిదని, మన దెబ్బకు సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా పోయిందని బాబు వ్యాఖ్యానించారు.
ఐదేళ్లుగా బటన్ నొక్కడం వినా ఏం చేశాడు?
గత ఐదేళ్లలో జగన్ బటన్ నొక్కడం వినా రాష్ట్రానికి ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. బటన్ నొక్కి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని, ధరలను నియంత్రించలేక ప్రజలపై మోయలేని భారం మోపాడన్నారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్‌డీ అంటూ, బాబాయ్ హత్య కేసులో నిందితులను బాధితులుగా, బాధితులను నిందితులుగా చూపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి తెచ్చి యువతను నాశనం చేసిన జగన్ నాయకుడా? అని నిలదీశారు. సమర్థ పాలనతో ఉద్యోగాలు ఇవ్వలేదు. సాగు రంగాన్ని ప్రోత్సహించలేదు. ప్రజల ఆశలు నెరవేర్చలేదు. కనీసం మేనిఫెస్టోలో.. ఏం చేయగలడో కూడా చెప్పుకోలేని దద్దమ్మ నాయకుడినని ఎలా ప్రకటించుకుంటాడని ప్రశ్నించారు.
ప్రజల భూములు కొట్టేసేందుకు కుట్ర
కొత్తగా జగన్ తెచ్చింది భూహక్కు చట్టం కాదని, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల భూములు కొల్లగొట్టి తాను యజమాని అవుదామని కుట్ర పన్నుతున్నాడని, అందుకే ప్రమాదకరమైన చట్టం తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో జగన్‌రెడ్డి భార్య ఎన్నికల ప్రచారానికి వచ్చారని, కొత్త చట్టంపై పార్టీ శ్రేణులే నిలదీస్తే ఆమెనుంచి సమాధానం లేదన్నారు. తాతముత్తాతల ఆస్తులపై జగన్ ఫోటొలు వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సైకో ఫొటో చూడగానే ప్రజలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్‌రెడ్డిని ఓడిరచి రాష్ట్రంనుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోను
తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఛార్జీలు పెంచుకుండానే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చామని, జగన్ ఏలుబడిలో ఐదేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చంద్రబాబు ఆగ్రహించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, చెత్తపన్ను, ఇంటిపన్ను, వృత్తి పన్ను ఇలా అన్నిటిపై రేట్లుపెంచేసి ప్రజల బతుకుల్ని ఛిద్రం చేశాడన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, ధరల నియంత్రణతో ప్రజలపై భారం తగ్గిస్తానన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లిఫ్టులు పెట్టి అయినా దెందులూరుకు నీళ్లు
దెందులూరు తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైతే రెండు లిఫ్ట్‌లు పెట్టయినా పోలవరం నుంచి నీళ్లందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి మెట్ట ప్రాంతానికి సమృద్ధిగా సాగునీరు అందిస్తానని, పంటలు బాగా పండిరచుకోవచ్చన్నారు. ఆక్వా రైతులకు రూ.1.50లకే యూనిట్ కరెంటు ఇస్తానని, పామాయిల్‌కు మద్దతు ధర ఇస్తామని, ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇస్తూనే, రైతుకు పంట పెట్టుబడి కింద ఏటా రూ.20వేలు ఆర్థికసాయం చేసామన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి మెరుగైన ఫలితాలు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి సంతకం మెగా డిఎస్పీపైనే పెడతానని, ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు.
ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మ్యానిఫెస్టో
ఆడపడుచులను దృష్టిలో పెట్టుకునే మేనిఫెస్టోలో పథకాలు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. మహిళలకు నెలకు రూ.1,500, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గిస్తానన్నారు. ప్రజలకు న్యాయం చేయాలన్న తపనవున్న పవన్ కల్యాణ్, మనకు సహాయకారిగా కేంద్రం కూడా ఉంది. 2047నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ చేయాలని నరేంద్రమోదీ చూస్తుంటే.. ఆ సమయానికి తెలుగుజాతి అగ్ర జాతిగా ఉండాలనే ఆలోచన తాను చేస్తున్నానని చంద్రబాబు అన్నారు.
లండన్ బాబు పేకాట కంపెనీలు తెచ్చాడు
దెందులూరులో ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని దందాల ఊరుగా మార్చిన లండన్ బాయ్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐటీ కంపెనీ తెస్తానని తీసుకురాలేదు. వచ్చిన కంపెనీ పేకాట కంపెనీ అని దుయ్యబట్టారు. గుడి, బడి అనే తేడా లేకుండా మద్యం అమ్ముతున్నాడని, పోలవరం కాలువ మట్టి దోచేశాడని, దీనివల్ల ప్రజల పొలాల్లోకి నీళ్లు వచ్చి పంటలు పాడైపోతాయన్నారు. కొల్లేరు 5 నుండి 3 కాంటూరుకు రావాలని మీ కోరిక. అధికారంలోకి వచ్చాక కేంద్రంతో ఈ విషయాన్ని చర్చిస్తాను. సెంటు పట్టాల విషయంలో రూ.20 లక్షల భూమిని రూ.40లక్షలకు కొనుగోలు చేసి డబ్బులు దోచుకున్నారు. జగన్నాథóపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుండి బటన్ నొక్కాడు. ఒక్క పనీ మొదలు పెట్టలేదని బాబు దుయ్యబట్టారు. జగన్‌రెడ్డి బటన్ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుందని, మీ పనులు పూర్తికావన్నారు. అధికారంలోకి రాగానే కాల్వల పూడికలు తీయిస్తామని, రైతులకు కష్టాలు లేకుండా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఎంపీగా పోటీ చేస్తున్న మహేష్‌యాదవ్ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. మీకు న్యాయం చేస్తాడు. మహేష్‌యాదవ్‌కు పరిశ్రమలు తెచ్చే శక్తి ఉంది. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి చింతమనేని ప్రభాకర్, మహేష్‌యాదవ్‌లను గెలిపించే బాధ్యత మీది. మీరు వీళ్లను కోరుకున్నందునే…మీ వద్దకు పంపించాను…వీళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. జన సైనికులు ఒకవైపు…ఎమ్మార్పీఎస్ మరో వైపు మనకు అండగా ఉన్నారు. జిల్లాలవారీగా మాదిగలు, మాలలకు రిజర్వేషన్ క్యాటగిరీలు పెట్టే బాధ్యత తీసుకుంటామని మ్యానిఫెస్టోలో పొందుపర్చాం. ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ టీడీపీ, ఎన్డీఏ కూటమి. రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలదొక్కుకోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. రానున్న 10రోజులు మాకోసం పనిచేయండి… రానున్న ఐదేళ్లు రేయింభవళ్లు మీకోసం కష్టపడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. వంగవీటి రాధాకృష్ణ నిజాయితీగా, ప్రజలకు ఏదోకటి చేయాలని తపన ఉండే నాయకుడు. తండ్రి పేరును అడ్డుపెట్టుకుని చాలామంది పదవులు ఆశిస్తారు. కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ. ప్రజాక్షేత్రంలో ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి దూసుకెళుతున్నాడు. ప్రజలకు అండగా నిలిచేందుకు నిరంతర శ్రామికుడిలా పనిచేస్తున్నాడు. రాధాకృష్ణ సేవలు రాష్ట్రానికి అవసరం..సరైన గుర్తింపునిచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.