- యువతను దగా చేసిన జగన్
- చేపట్టవలసిన పనులు చాలా ఉన్నాయి
- అధికారంలోకి రాగానే అన్నీ పూర్తి చేస్తా
- కూటమి అభ్యర్థులను గెలిపిచే పూచీ మీది
- పలాస ప్రజాగళం సభలో చంద్రబాబు
పలాస (చైతన్య రథం): రాష్ట్రంలో దొంగలు పడ్డారు. మనందరం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకు అందరూ సిద్ధంగా ఉండమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పలాసకు అనేకసార్లు వచ్చినా.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాగళానికి ఆదరణ పెరగడం అంటే, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టేనని అన్నారు. వైసీపీని మట్టి కరిపించడానికి తెలుగుతమ్ముళ్లు, జన సైనికులు, కమలం శ్రేణులు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ఊసెత్తగానే సమర్థనాయకుడు ఎర్రన్నాయుడు గుర్తొస్తారని, ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి తీరనిదన్నారు. తండ్రికి తగ్గ బిడ్డ రామ్మోహన్‌నాయుడు రెండుసార్లు ఎంపీి అయ్యాడని, మూడోసారి ఎంపీ చేయడానికి మీరు సిద్దంగా ఉండాలన్నారు. ఆ రోజుల్లో ప్రజలు, రైతుల కోసం శ్రీకాకుళం నుంచి చెన్నైకి రైతు మార్చ్‌పెట్టిన మహా నాయకుడు గౌతు లచ్చన్న. అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీష వైసీపీ వైఖరిని భరించలేక బయటకు వచ్చారని, ఆమెను గెలిపించుకుని వైసీపీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
హుద్‌హుద్ తుపాను సమయంలో రెండువారాలపాటు ఇక్కడే బస్సులోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దానని బాబు గుర్తు చేశారు. తిత్లీ తుపాను సమయంలోనూ ఇక్కడే ఉండిపోయి బాధితులతో కలిపి దసరా చేసుకున్నానన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలొ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకోగలిగామని, అప్పుడు పాదయాత్రలో ఇక్కడేవున్న జగన్ కనీసం బాధితులను పరామర్శ కూడా చేయలేదన్నారు. ప్రజలు కష్టంలోవుంటే జగన్‌కు పట్టకపోవడం దారుణమన్నారు. మీకు కష్టమొస్తే ఆదుకోవడానికి గౌతు శిరీష, రామ్మోహన్‌నాయుడు ముందుంటారని, ఇద్దరినీ గెలిపించుకునే బాధ్యత మనదేనన్నారు. ఉత్తరాంధ్రకు తాగునీటి ప్రాజెక్టులు తేవడంలో ఎర్రన్నాయుడి పాత్ర మర్చిపోలేమని, కిడ్నీ బాధితులకు మొట్టమొదటిసారి పింఛను ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలను పవన్ కల్యాన్ నా దృష్టికి తెచ్చినప్పుడు వెంటనే స్పందించి డయాలసిస్ సెంటర్లు పెట్టి బాధితులకు అండగా నిలిచామన్నారు. కిడ్నీ సమస్య శాశ్వత నివారణ సంకల్పంతో రిసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సివున్నా, వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ యువతను దగా చేశాడు
ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువతే. రాష్ట్రంలో ఎక్కువమంది డిఫెన్స్‌లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా యువతే. దేశం కోసం వీరోచితంగా పోరాడే శక్తి, పట్టుదల జిల్లా యువతకు ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ పేరుతో యువతను జగన్ మోసం చేశాడన్నారు. టీడీపీ హయాంలో మొత్తం 11 డిఎస్సీలు ఇచ్చామని, టీచర్లలో 70శాతం టీడీపీ హయాంలో ఉద్యోగాలు పొందినవారేనన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డిపస్సీపైనే పెడతానన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని, ఉద్యోగులు ఆత్మగౌరవంతో పనిచేసే విధంగా పీఆర్సీ, డీఏలు చెల్లిస్తామన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుందన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ `ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానన్నారు. విశాఖ నుంచి భావనపాడు వరకూ బీచ్‌రోడ్డును తీసుకెళ్లి.. పరిశ్రమలు తీసుకొచ్చి టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. దీనివల్ల ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.
కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తా
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు వంశధారకు తీసుకురావాలని, వంశధార నీళ్లు బారువా వరకు తీసుకెళ్లాలనేది తన ఆలోచనగా చంద్రబాబు చెప్పారు. జీడిపప్పు ధరలు విపరీతంగా పడిపోయి ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 80 కేజీల బస్తా రూ.16 వేల నుంచి రూ.7 వేలకు పడిపోయింది. ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జీడి పంటల కోసం బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా గిట్టుబాటు ధర కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహేంద్ర ఆఫ్ షోర్ పూర్తి చేస్తామని, కిడ్నీ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఉద్యాన వనాలు కాపాడుతామని, వంశధార కాలువ సిమెంటు లైనింగ్ వేస్తామని, పలాసలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని, ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్నారు. పలాసలో రైతు బజారు తెరిపిస్తామని, డిఫెన్స్ అకాడమి, ఐయస్‌ఐ ఆస్పత్రి, స్కిల్ డెవలఫ్ సెంటరు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 1900 టిడ్కో ఇళ్లు వూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతోనే కూటమి
రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతోనే తెదేపా, జనసేన, బీజేపీ కలిశాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని తుదముట్టించక తప్పదన్నారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికే మూడు పార్టీలు కూటమి కట్టాయని, ఎన్డీయే భాగస్వాములయ్యామని వివరించారు. అభివృద్ధి-సంక్షేమం-ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్యేయమని చంద్రబాబు వివరించారు.