అనకాపల్లి,చైతన్యరథం: ‘‘అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తొస్తుంది. కానీ, ఇప్పుడు అనకాపల్లి కోడి గుడ్డు పేరు వింటున్నాం. కోడి గుడ్డు పెట్టింది. ఇంకా పొదుగుతూనే ఉంది వైకాపా కోడి… ఈ జిల్లాకు ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్టుఫోలియోలకు మంత్రిని, ఒక విప్‌ను ఇచ్చింది. కానీ, ఒక్క కిలోమీటరు రోడ్డు కూడా వేయలేకపోయింది’’ అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి పవన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ఒక సీఎం కాదు… సారా వ్యాపారి, ఇసుక దోపిడీ దారు అని ధ్వజమెత్తారు. ‘‘నా ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది. కానీ, నాకు పదవులు ముఖ్యం కాదు… రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదు. అయినా సరే, మీ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నా. ఈరోజు ఎక్కడికి వెళ్లినా నాకు అశేష ప్రజాభిమానం ఉంది. ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్ధం ఉంటుంది. కానీ, స్వార్థాన్ని దాటి మీకోసం వచ్చా. కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అన్ని శక్తులు కలవాలి. అందుకే… 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకున్నాం. అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేనది అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చింది. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎన్టీయే ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమో నాకు తెలుసు. సీపీఎస్ సమస్యకు పరిష్కారం చూపుతాం’’ అని పవన్ హామీ ఇచ్చారు.