- కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ భరోసా
- కోడుమూరు నియోజకవర్గంలో ‘నిజం గెలవాలి’
- నాలుగు కుటుంబాలకు పరామర్శ
- రూ. 3లక్షల ఆర్థిక సాయం అందజేత
కర్నూలు(చైతన్యరథం): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమని, వారికి, వారి కుటుంబాలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. అధినేత కోసం ప్రాణాలు వదిలిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి కన్నీరు తుడుస్తామని భరోసా ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, ఆర్థికసాయం అందించేందుకు నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి శుక్రవారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో పర్యటించి, నలుగురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందిన కార్యకర్తల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కార్యకర్తల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
కోడుమూరు మండలం, పైలకుర్తి గ్రామంలో గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన మృతిచెందిన నాగార్జున గౌడ్(55) కుటుంబాన్ని,గూడూరు మున్సిపాలిటీ, 18వ వార్డ్‌లో గత ఏడాది సెప్టెంబర్ 14న మృతి చెందిన మండ్ల గౌరన్న(65) కుటుంబాన్ని, ఆ ప్రాంతంలోనే గత ఏడాది సెప్టెంబర్ 15న మృతి చెందిన షేక్షావలి (68) కుటుంబాన్ని, గూడూరు మండలం, పెంచికలపాడు గ్రామంలో గత ఏడాది సెప్టెంబర్ 17న మృతి చెందిన మహమ్మద్ బాషా(50) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థికసాయం అందచేశారు.
కార్యకర్త కుమారుడిని ఉచితంగా చదివిస్తాం
పెంచికలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త మహబూబ్ బాషా కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా పిల్లల గురించి భువనమ్మ వివరాలు తెలుసుకున్నారు. మహబూబ్ బాషాకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడిని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అతడు 8వ తరగతి చదువుతుండగా, కుమార్తెలు గతంలోను ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేశామని వివరించారు. మహబూబ్ బాషా కుమారుడు షేక్షావలిని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచితంగా చదివిస్తానని భువనమ్మ హామీ ఇచ్చారు.