- సరైన అంచనాలు లేకుండానే కేటాయింపులు
- వాస్తవ ఖర్చుతో పోలిస్తే భారీ వ్యత్యాసం
అమరావతి: నిర్ణీత దిశలో ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిం చేందుకు సహకరించే ప్రధాన సాధకం వార్షిక బడ్జెట్. అంత ప్రాధాన్యత కలిగిన బడ్జెట్‌లను రూపొందించి అమలు పరచటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయం పట్ల గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యాన్ని ప్రదర్శస్తూ వచ్చింది.
వార్షిక ఆర్థిక ప్రణాళికకు సంబంధించి ఆదాయ, వ్యయాలను వాస్తవిక దృష్టితో బాధ్యతాయుతంగా అంచనాలు వేసి బడ్జెట్ ను రూపొందిస్తే బడ్జెట్ అంచనాలు, అంతిమ వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసం అత్యల్పంగా ఉంటుంది. ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే ఆయా ప్రభుత్వాల అలసత్వాన్ని, అసమర్థతను ఎత్తిచూపుతుంది.
2014-19, 2019-24 సంవత్సరాలకు సంబంధించి వివిధ ప్రధాన రంగాలకు జరిపిన వార్షిక కేటాయింపులు, వాస్తవ ఖర్చుల వివరాలను పరిశీలిస్తే బడ్జెట్ల రూపకల్పన, వాటి అమలులో తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య వ్యత్యాసం స్పష్టమౌతుంది.
గత చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 20 ప్రధాన రంగాలకు మొత్తం రూ. 4,83,107.73 కోట్ల కేటాయింపులు జరగగా, అంతిమంగా ఇందులో రూ.4,77,264.97 కోట్ల మేరకు ఖర్చు పెట్టింది. అంటే.. ఆయా రంగాలకు జరిగిన మొత్తం కేటాయింపుల్లో 99 శాతం ఖర్చుతో మంచి ఫలితాలను సాధించారు.
అవే రంగాలకు జగన్‌రెడ్డి పాలనలో మొత్తం రూ. 8,31,784.90 కోట్ల మేరకు కేటాయింపులు ప్రతిపాదించబడగా ఐదేళ్ల పాలన పూర్తికానున్న తరుణంలో వాస్తవ ఖర్చు కేవలం రూ. 6,91,784.90 కోట్లు మాత్రమే. అంటే.. కేటాయింపుల్లో 83 శాతం మాత్రమే ఖర్చు చేసినట్లు వెల్లడౌతోంది. 2022-23 మరియు 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వాస్తవ ఖర్చుల వివరాలు వెల్లడైనప్పుడు ఈ వినియోగ శాతం ఇంకా తగ్గే అవకాశాలుంటాయి.
రంగాలవారీగా.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 8 రంగాల్లో 100 శాతానికి పైగా కేటాయింపులు వినియోగించగా, మరో 7 రంగాల్లో 80 శాతానికి పైగా ఖర్చు జరిగింది.
100 శాతానికి పైగా కేటాయింపులను వినియోగించుకున్న రంగాలు:
గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, ఇంధనం, రవాణా, సాగునీటి సరఫరా, పక్కా ఇళ్ల నిర్మాణం, సామాజిక భద్రత..సంక్షేమం, సమాచార ప్రజా సంబంధాల శాఖ.
ప్రస్తుత జగన్ పాలనలో కేవలం 3 రంగాల్లో.. ఇంధనం, సాంకేతిక విద్య, వైద్య రంగాలకు సంబంధించిన కేటాయింపుల్లో మాత్రమే 100 శాతానికి పైగా ఖర్చు చేయగలిగారు. మరో 7 రంగాల్లో 80 శాతానికి పైగా నిధులు వినియోగించారు.
సామాజిక భద్రత, సంక్షేమానికి జరిపిన కేటాయింపుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం 111 శాతం మేరకు నిధులను వినియోగించుకోగా, జగన్ రెడ్డి ప్రభుత్వం 80 శాతం మేరకే కేటాయింపులను వినియోగించుకుంది.