- జగన్ కర్కశపాలనలో అంగన్వాడీ చెల్లెమ్మలు బలి
- మరో 3 నెలల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం
- ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తుంది
- అంగన్‌వాడీలకు లోకేష్ భరోసా
అమరావతి: ఎంతటి నియంతలైనా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ కర్కశ పాలనలో అంగన్‌వాడీ చెల్లెమ్మలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజులు, రాజ్యాలు అంతరించిపోయి ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలిసారిగా సుమారు అయిదేళ్ల క్రితం ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారు. ఆయన అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాలు చేస్తున్నాడు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే కనీస స్పందన లేకపోగా, విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తన పాలేరు సజ్జలతో బెదిరింపులకు దిగుతున్నాడు. ప్రభుత్వ అనాలోచిత, మొండివైఖరి కారణంగా ఇప్పటికే ఇద్దరు అంగన్వాడీ చెల్లెమ్మల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అంగన్వాడీలపై జగన్ ప్రయోగించిన ఎస్మా ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారబోతోంది.
ఎంతటి నియంత అయినా ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పదన్న చారిత్రక సత్యాన్ని గుర్తించలేని జగన్… మరో 3 నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరిపోకుండా న్యాయమైన డిమాండ్ల సాధనకు 40రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. టీడీపీ-జనసేన నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు.