అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం పాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి పాతరేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను మూసేయడంపైనా, మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డికి బుధవారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం లోపించిదని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బ్రిటిష్ వలస పాలన నాటి రహస్య విధానాలను అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వ జీవోలను కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయటం నిలిపివేసిందన్నారు. హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీపుకోండంతో హడావుడిగా కొన్ని జీవోలు అప్‌లోడ్ చేస్తోందన్నారు. సుపరిపాలన అంటే పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఆ లక్షణాలే లేవన్నారు. గత టీడీపీ ప్రభత్వంలో మద్యం రోజువారీ విక్రయాలు, నాణ్యత, పరిమాణానికి సంబంధించిన సమాచారాన్ని, అమ్ముడైన మద్యం కేసులతో సహా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వివరాలను పారదర్శకంగా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. మద్యం సంబంధిత కేసులను ఆన్‌లైన్ నుండి తొలగించారు. తదనంతరం, అమ్మకాలు, ఆదాయ వివరాలు కూడా ఆన్‌లైన్ నుండి తొలగించారు. దీంతో పారదర్శకతకు పాతరేసినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్న తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దేశమంతటా చిన్నచిన్న దుకాణాల్లో కూడా ఆన్‌లైన్ చెల్లింపులు జరుపుతుంటే మన రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో మాత్రం కేవలం నగదు చెల్లింపులనే అనుమతిస్తున్నారు. మద్యం దుకాణాల్లో కేవలం నగదు చెల్లింపులే జరుగుతున్నందువల్ల పారదర్శకత లేకుండా పోతోంది. ఆదాయాన్ని పక్కదారి పట్టించేందుకు, దాచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదాయాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అదే సమయంలో మద్యం విక్రయాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మూసివేయటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. మద్యం అమ్మకాల వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి రాకుండా తప్పించేందుకే ప్రభుత్వం వెబ్‌సైట్‌ను మూసివేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైకాపా ప్రభుత్వం లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది. కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు, లిక్కర్ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్ డేటాను వెబ్ సైట్ నుంచి తొలగించారు. ఈ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా అధికారులను బలిపశువులు చేసేందుకు రాజకీయ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తప్పుడు పనులు చేసేలా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నారు. మీకు తెలుసు.. ప్రభుత్వాలు మారతాయి. కానీ అధికారులు శాశ్వతంగా ఉంటారు. తప్పుడు పనుల విషయంలో రాజకీయ బాస్‌లకు తోడ్పడే అధికారులు తరువాతి కాలంలో నష్టపోతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వ్యూహాలకు బలి కాకుండా అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలి. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పనిచేసేలా చూడండి. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అధికారులకు తరువాత ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తక్షణం మద్యం అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు తీసుకావాలి. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.