- రూ.10 వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం 700 కోట్ల రూపాయల మేరకే నివేదిక ఇవ్వడమేంటి?
- ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందో వెల్లడిరచాలి
- ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పాలి
- తుఫాన్, కరువు నష్టంపై శ్వేతపత్రం ప్రకటించాలి
అమరావతి,చైతన్యరథం: జగన్‌రెడ్డి అసమర్థత, అహంకార వైఖరి రైతుల పాలిట శాపంలా మారిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 31 రకాల పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టం దాదాపు 10 వేల కోట్ల రూపాయల పైన ఉండగా కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే జరిగిందని కేంద్రానికి నివేదిక ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయిందని, ప్రాజెక్టుల, పంట కాల్వల నిర్వహణలో జగన్‌రెడ్డి అసమర్థత కారణంగానే ఇంత భారీ నష్టం జరిగిందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్లను ఆపలేకపోవచ్చునని, కానీ నష్ణాన్ని నివారించగలమన్నారు. ఆ పని చేయడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తుఫాన్ వస్తుందని తెలిసినా, ఎన్నో రోజుల నుండి హెచ్చరికలు వస్తున్నా, రైతులను అప్రమత్తం చేసి పంట నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు.
ప్రాజెక్టుల, పంట కాల్వల నిర్వహణలో నిర్లక్ష్యం
జగన్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగంపై శీతకన్ను వేసిందని, ప్రాజెక్టుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వ హయంలో ప్రాజెక్ట్‌ల నిర్వహణకు బడ్జెట్‌ను కేటాయించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవాళ్లమని, దాని వల్ల రైతులకు చాలా ఉపయోగం జరిగిందన్నారు. కానీ జగన్‌రెడ్డి ప్రభుత్వ నిర్వహణ లోపం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, పులిచింతల గేటు ఊడిపోయిందని, గుండకమ్మ ప్రాజెక్ట్‌కయితే రెండుసార్లు గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. ఎనిమిది కోట్ల రూపాయలతో గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు గేట్లు అమర్చేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, దీంతో గేట్లు తెగిపోయి ఆ ప్రాజెక్ట్‌లోని రెండు టీఎంసీల నీరు వృథాగా పోయిందన్నారు. దీంతో నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతానికి నష్టం జరిగిందని, ఇది జగన్‌రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. పంట కాల్వలు, డ్రైన్లను సరిగ్గా నిర్వహించని కారణంగా తుఫాన్ వల్ల వచ్చిన వరదంతా పంట పొలాల్లోనే నిలిచిపోయిందన్నారు. పంట పొలాలన్నీ సముద్రంలా తలపించాయని, డ్రైన్ల నిర్వహణ సరిగ్గా చేసి ఉంటే రైతులకు అంత నష్టం జరిగేది కాదని, ఇది జగన్‌రెడ్డి నిర్లక్ష్యానికి, వ్యవసాయమంటే పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
నేను పట్టిసీమ కట్టానని.. నీళ్లు వదలలేదు
నవంబర్, డిసెంబర్‌లో వచ్చే తుఫాన్ల నుంచి తప్పించేందుకు ముందుగానే ఖరీఫ్ పంట తీసుకొచ్చేందుకు పట్టిసీమ ప్రాజెక్ట్‌ను నిర్మించామని, నాలుగేళ్ల పాటు రైతులు ప్రయోజనం పొందారని, అయితే జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు తెలిపారు. గోదావరి నీళ్లు త్వరగా వస్తాయని, ఆ నీరు సారవంతంగా కూడా ఉంటుందని, దీంతో రైతులకు ఎంతో లాభం జరిగిందని చెప్పారు. అయితే తాను పట్టిసీమను కట్టాననే కోపంతోనే జగన్‌రెడ్డి గత నాలుగేళ్ల నుండి పట్టిసీమ నుండి నీళ్లు వదలలేదని, ఈ ఏడాది రైతులు తిరగబడి తంతారనే భయంతోనే నీళ్లు వదలారని, కానీ అప్పటికే ఆలస్యమైపోయిందని తెలిపారు. పట్టిసీమలో ముందుగానే నీళ్లు ఇచ్చి ఉంటే ఈ తుఫాన్ ప్రభావం నుండి కృష్ణా డెల్టా తప్పించుకునేదన్నారు.
తుఫాన్, కరువు నష్టంపై శ్వేతపత్రం ప్రకటించాలి
తుఫాన్‌కు తోడు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారని, వారిని ఆదుకోవాల్సిన జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. ఇంతవరకు ఎన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదో చెప్పడం లేదన్నారు. వెంటనే ప్రాంతాల వారీగా పంటల వారీగా ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా నష్టపోయిన పంటలకు ఎంత పరిహారం ఇస్తారో కూడా ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు. గత నాలుగేళ్ల నుండి పంటల బీమా కట్టని కారణంగా అంతిమంగా రైతులే నష్ట పోయారని తెలిపారు. సీఎం అంటే కష్టాల్లో ఉన్న వారికి భరోసా కల్పించాలని, దోపిడీ చేయడం కాదని అన్నారు. తుఫాన్ కారణంగా 22 లక్షల ఎకరాల్లో రూ. 10 వేల కోట్ల మేర పంట నష్టం జరిగితే కేవలం 700 కోట్ల రూపాయల మేరకే పంటనష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక ఇవ్వడం ఏంటని, ఇక కేంద్రం నుండి ఏం నిధులు వస్తాయని ప్రశ్నించారు. తుఫాన్ కారణంగా భారీగా నష్టం జరిగితే కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్‌రెడ్డి అలెర్ట్ చేయలేదని, జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తాను ప్రధానికి లేఖ రాశానని గుర్తు చేశారు. ఒక వైపు తుపాను, మరోవైపు కరువు కారణంగా రాష్ట్రంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని అన్నారు. కరువు కారణంగా 25 లక్షల ఎకరాల్లో పంట వేయలేదని ప్రభుత్వమే చెప్తోందని, అయితే కరువు సహాయం కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క రూపాయి అయినా అడిగారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తుపాన్, కరువు కారణంగా జరిగిన పంట నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద ఎంతమేరకు సహాయం చేశారలో శ్వేతపత్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.