అమరావతి: జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయ బదిలీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్ని బదిలీచేసినట్టు జగన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని ఇతర నియోజకవర్గాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడని, ఒక చోట పనికిరాని వారిని మరో చోట కి పంపుతుంటే.. ప్రజలేమో ఎవరైనా ఒకటే కదా అని పెదవి విరుస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలతో పాటు, తనపై కూడా ప్రజల్లో అదే దురభిప్రాయం ఉందనే వాస్తవాన్ని జగన్ రెడ్డి గ్రహించాలని అనంద్ బాబు హితవు పలికారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం మంత్రిగా ఉన్న వ్యక్తిని మరో నియోజకవర్గానికి జగన్ బదిలీ చేశాడంటే, తన సర్వేల్లో అతను గెలుపునకు పనికిరాడని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టేగా అన్నారు. ఇప్పటివరకు ఓట్లేసిన పాపానికి వైసీపీ ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల ప్రజలు భరించారు. ఇకపై వారిని, వారి అఘాయిత్యాలను, దోపిడీని ఇతర నియోజకవర్గాల వారు కూడా భరించాలి. ప్రధాన ప్రతిపక్షంగా తాము సద్విమర్శలు చేస్తున్నాం గానీ, జగన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ నియోజకవర్గం మారినా, ఎక్కడ పోటీచేసినా మాకేమీ నష్టం లేదు. ఓడిపోయే వారు ఎక్కడ పోటీచేస్తే మాకేంటని అనంద్ బాబు అన్నారు.
దారుణమైన పరాజయం చవిచూస్తాడు
జగన్ రెడ్డి ఒకవైపు లోలోన ఓటమి బాధతో కుమిలిపోతూ, పైకి మాత్రం ఇంకా వైనాట్ 175 అంటున్నాడు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే అంటున్నాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో ఓటమి మూటగట్టుకున్న జగన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అంతకంటే దారుణమైన పరాజయం చవిచూడటం ఖాయం. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుప్పం, పులివెందులలో టీడీపీయే గెలిచింది. అలాంటి టీడీపీ కి నిర్మాణం లేదంటున్నారు. 40 ఏళ్లకు పైగా టీడీపీ ప్రజల అభిమానంతో గ్రామ స్థాయి నుంచి పటిష్టమైన నిర్మాణం ఏర్పాటు చేసుకుందనే విషయాన్ని జగన్ రెడ్డి, సజ్జల తెలుసుకోవాలి. వాలంటీర్లు.. ఐప్యాక్ సంస్థే వైసీపీ పునాది. వేలకోట్ల ప్రజలసొమ్ముని వాలంటీర్లకు, ఐప్యాక్ సంస్థకు దోచిపెడుతూ, ఆ వ్యవస్థల్ని నమ్ముకొని జగన్ రెడ్డి మిడిసిపడుతున్నాడని ఆనంద్ బాబు విమర్శించారు.
ప్రజలు ఇక వైసీపీని భరించే స్థితిలో లేరు
వైసీపీ ఓడిపోయే స్థానాల్లో కావాలనే జగన్ రెడ్డి బీసీలు, దళితుల్ని నియమిస్తున్నాడు. టీడీపీ పుట్టిందే బీసీలు, దళితులకోసం. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. టీడీపీలో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఉంటుంది. వైసీపీలో దళితులకు గౌరవం ఉందా? దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని జగన్ రెడ్డి, అతని పార్టీ ఎంత బాగా గౌరవిస్తాయో చూస్తూనే ఉన్నాం. కనీసం వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వని దుస్థితి ఉంది. ఆత్మగౌరవం తాకట్టుపెట్టి మరీ సిగ్గులేకుండా బతుకుతున్నందుకు ముందు వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తప్పుబట్టాలి. వైసీపీ దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ భవిష్యత్ ఏమిటా అని వణికిపోతున్నారు. జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనా ల కోసం సొంత బాబాయ్ నే చంపించాడు. తల్లి, చెల్లే అతని వద్దకు రావడానికి వణికిపోతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి షర్మిల ఏమైనా ఏపీలో అడుగుపెడుతుందేమో అని ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డి ఎవరిని ఎటు మార్చినా, ఎవరికి టిక్కెట్లు ఇచ్చినా ప్రజలు వైసీపీని భరించే స్థితిలో లేరు. అధికార పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని అన్ని సర్వేలు తేల్చాయి. జగన్ రెడ్డి ఆ సర్వేల వివరాలు దాచి, మాయమాటలతో తన పార్టీ వారిని మోసగిస్తున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రుల్ని బదిలీ చేయడం మానేసి ముందు జగన్ రెడ్డి తనను తాను బదిలీ చేసుకోవాలి. పులివెందులలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించలేని జగన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాడా? మంత్రిగా ఉన్నవారినే ప్రజలు నమ్మకపోతే, వారే ఇతర నియోజక వర్గాలకు పారిపోతున్నారు అంటే, వైసీపీపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఎన్ని మార్పులు, చేర్పులు చేసినా ఆయనకు తిరిగి అధికారం కల్లే. ఎన్నికలు ముగిసి అధికారం కోల్పోయిన మరుక్షణం జగన్ రెడ్డి తనపైన ఉన్న కేసుల్లో జైలుకు వెళ్లడం తథ్యం. జగన్ రెడ్డికి, అతనిపార్టీకి అసలు ఒక అజెండా ఉందా? 24 గంటలు.. వారం రోజులు…365 రోజులూ అవినీతి, దోపిడీలే జగన్ రెడ్డి అజెండా అని ఆనంద్ బాబు దుయ్యబట్టారు.
ప్రజలు వైసీపీని సాగనంపడానికి రోజులు లెక్కబెడుతున్నారు
వైసీపీని చూసి టీడీపీ ఏడవడం కాదు.. జగన్ రెడ్డి చర్యలతో సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏడుస్తున్నారని సజ్జల గ్రహించాలి. వైసీపీలో ఎక్కడైనా మచ్చు కైనా ప్రజాస్వామ్యం ఉందా? 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఈ నాలుగున్నరేళ్లలో జగన్ రెడ్డిని కలిశారు? ఎంతమంది తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో మాట్లాడారు? ప్రజలు అన్నీ గమనించే, వైసీపీని సాగనంపడానికి రోజులు లెక్కబెడుతున్నారని ఆనంద్ బాబు స్పష్టంచేశారు.