- కాంగ్రెస్ నుంచి రాజస్తాన్, చత్తీస్‌ఘడ్‌ల కైవసం
- 2018 ఎన్నికల పూర్వస్థితిని తిరిగి రాసిన బిజెపి
- భారాస నుంచి తెలంగాణను చేజిక్కించుకున్న కాంగ్రెస్
అమరావతి : నిన్నటితో ముగిసిన నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో గెలిచి తన హవా చాటుకుంది. ఇందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ను తిరిగి గెలుచుకొని రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లను కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిలో మరో రాష్ట్రంలోకి అధికారంలోకి రాగా, ఉత్తర భారతంలో ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించి బిజెపి తనపట్టు బిగించుకుంది.
ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పోలైన ఓట్ల కౌంటింగ్ నిన్న పూర్తయింది. ఫలితాలకు సంబంధించి అందిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌లో అధికార బిజెపి భారీ మెజార్టీ సాధించింది. ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 230 స్థానాలు ఉండగా అధికార బిజెపి 164 స్థానాలను గెలుచుకొని దాదాపు 75 శాతం సీట్లను గెలచుకునే స్థితిలో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 65 స్థానాలను మాత్రమే గెలుచుకొని ఆశించిన ఫలితాల కంటే భారీగా వెనకబడిరది. 2018 శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయగా తర్వాత కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది.
200 శాసనసభ స్థానాలు కలిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ప్రతిపక్ష బిజెపి అంచనాలకు మించి 115 సీట్లు గెలుచుకోగా అధికార కాంగ్రెస్ 70 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. బిఎస్‌పి రెండు సీట్లు, ఇతరులు 13 గెలుచుకున్నారు. గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు మారే సంప్రదాయం ఈ ఎన్నికల్లో కూడా కొనసాగింది. 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ 100 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బిజెపి 73 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో 41 స్థానాలను అధికార కాంగ్రెస్, ఇతరుల నుంచి బిజెపి కైవసం చేసుకోగలగడం విశేషం.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్‌ఘడ్‌లో మొత్తం 90 శాసనసభా స్థానాల్లో ప్రతిపక్ష బిజెపి 54 స్థానాలను గెలుచుకొని అధికార కాంగ్రెస్‌ను 35 సీట్లుకే పరిమితం చేసింది. బిఎస్‌పి ఒక సీటు గెలుచుకుంది. రాష్ట్రంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ 68 సీట్లను గెలుచుకోగా బిజెపి కేవలం 15 స్థానాలను మాత్రమే దక్కించుకోగల్గింది. ఈ ఎన్నికల్లో కేవలం 90 స్థానాలే ఉన్న శాసనసభలో 39 సీట్లను కాంగ్రెస్, ఇతరుల నుంచి కైవసం చేసుకోవడం గమనించదగ్గ విషయం.
చరిత్ర తిరగరాసిన బిజెపి
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మద్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో విజయాలు సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌కు ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు చాలా ఊరటనిచ్చాయి. కొద్ది నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించి బిజెపి చరిత్ర తిరగరాయడం గమనార్హమని రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు భారీ విజయాలతో సంప్రదాయంగా ఉత్తర భారతంలో తనకున్న ఆధిపత్యాన్ని బిజెపి మరింత బలిష్టం చేసుకున్నట్లుగా వెల్లడైంది.
40 స్థానాలున్న మిజోరం శాసనసభకు జరిగిన ఎన్నికల
ఓట్ల లెక్కింపు నేడు జరుగుతుంది
గురితప్పిన ఎగ్జిట్ పోల్స్
గత నెల 30న పలు సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకు గురి తప్పాయి. తెలంగాణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంకేతాలు రుజవైనా తక్కిన మూడు రాష్ట్రాల్లో అవి వాస్తవానికి దూరంగా నిలిచాయి. తెలంగాణకు సంబంధించి వెల్లడైన 20 ఎగ్జిట్‌పోల్స్‌లో 15 కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన మాట వాస్తవ రూపం దాల్చింది.
90 శాసనసభా స్థానాలు కలిగిన చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆరు ఎగ్జిట్‌పోల్స్ సూచించగా మరో రెండు హంగ్ ఏర్పడవచ్చని తెలిపాయి. వీటికి పూర్తి విరుద్దంగా 55 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్ష బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండడం ఎగ్జిట్‌పోల్స్ వైఫల్యాన్ని ఎత్తి చూపింది.
మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆరు ఎగ్జిట్‌పోల్స్ నిర్వహింపబడగా అందులో రెండు మాత్రమే బిజెపికి అనుకూలంగా రాగా తక్కిన నాలుగు ఏ పార్టీకి స్పష్టమైన బహుమతి రాకపోవచ్చుని సంకేతాలు ఇచ్చాయి. అయితే నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో మధ్యప్రదేశ్‌లో బిజెపి సాధించిన ఘన విజయం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందలేదు.
రాజస్థాన్ ఫలితాలకు సంబంధించి మూడు ఎగ్జిట్‌పోల్స్‌లో రెండు బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సూచించగా మరోక పోల్ హంగ్ ఏర్పడవచ్చునని అభిప్రాయపడిరది. బిజెపికి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో కూడా ఇరు పార్టీలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉండకపోవచ్చుని భావించగా వాస్తవ ఫలితాల్లో బిజెపి 45 సీట్ల వ్యత్యాసంతో భారీ విజయాన్ని సాధించింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా వెల్లడౌతున్న ఎగ్జిట్‌పోల్స్ పలు సందర్భాల్లో వాస్తవాలకు దూరంగా ఉండడం వాటిపై ప్రజల్లో అనుమానాలకు దారితీస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా అంచనాలకు, వాస్తవాలకు ఉన్న వైరుధ్యం ప్రజాస్వామ్య ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తూ ఎగ్జిట్‌పోల్స్ నిర్వహించే విధివిధానాలకు సంబంధించి పటిష్ట సంస్కరణలు చేయవలసిన ఆవశ్యకతను మరోసారి ఎత్తి చూపింది.