‘‘నాపై తప్పుడు ప్రచారం చేసే ఎవ్వరినీ వదిలిపెట్టను’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… 2012 నుంచి తన రాజకీయ ఎదుగుదలను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అసత్య ఆరోపణలకు ఇక చెక్ పెట్టాలనే పరువునష్టం దావాలు వేస్తున్నట్లు తెలిపారు.
తన పై అసత్య ఆరోపణలు చేసిన వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం దావా విషయంలో ఆయన అదనపు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. వైకాపా నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలు తనపై తప్పుడు ప్రచారం చేశారని లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఉమామహేశ్వరి మరణం, హెరిటేజ్ సంస్థపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు వైకాపా నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పరువు నష్టం దావాలో లోకేశ్ పేర్కొన్నారు.
 
	    	 
 














