రికార్డులు తారుమారు పేరుచేసి తమ పొలాన్ని కబ్జాచేయడమేగాక, తమపై ఎమ్మెల్యే బావమరిది శ్రావణ్ కుమార్ ఎదురు కేసు పెట్టించాడని మర్రిపాడుకు చెందిన ఎస్ కె మహబూబ్ బాషా యువనేత నారా లోకేష్ వద్ద వాపోయాడు. నాయుడుపల్లిలో తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన యువనేతకు తెలియజేస్తూ… 2002లో టీడీపీ ప్రభుత్వ హాయాంలో అల్లంపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 528లో మాకు 7ఎకరాల బీడు భూమిని ఇచ్చారు. దాన్ని మేము బాగుచేసుకుని సాగు చేసుకుని జీవనాధారంగా మలుచుకున్నాం.
2018లో మల్లిపెద్ది ,రవీంద్రనాథ్, కుంచెం.రమణయ్య, చేజర్ల జ్యోతి, కన్నెమరకల. రమణయ్య అనేవారు అడంగల్ ను మార్ఫింగ్ చేసి మా భూమితో పాటు ఈ సర్వే నెం.లోని 17.26 ఎకరాలను వారిపేరిట రాయించుకున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు మా గ్రామానికి సంబంధించిన వారే కాదు. వీరు మా పేర్లను 1బీ అడంగల్ నుండి తొలగించి, వారి పేర్లను నమోదు చేసుకుని బ్యాంకుల్లో లోన్లు కూడా తెచ్చుకున్నారు. దీనిపై మేము ఎమ్మార్వోను కలువగా 1బి అడంగల్ రికార్డుల్లో భూమి వేరే వారి పేరుమీద మార్చబడి ఉందని, అది వారి పేరిట రిజిస్ట్రేషన్ కూడా అయిందని చెప్పారు. మేం ఆరాతీయగా ఆత్మకూరు మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శ్రావణ్ కుమార్ తల్లి కోడూరు కౌశల్యమ్మ పేరు మీద మా పొలం రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది.
మా పొలంతో పాటు పక్కనున్న మరో 7 ఎకరాలు ఆమె పేరుమీద రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుసుకున్నాం. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి బావ కావడంతో మాపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడు. మేము ఆయనపై న్యాయం పోరాటం చేస్తున్నందుకు మాపై 2022 నవంబర్ 25న అట్రాసిటీ కేసును పెట్టించారు. ఆయనతో పోరాడలేక మర్రిపాడు మండల ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నన్ను అడ్డుకున్నారు.
మండల సర్వేయర్ కూడా భూమి మాదేనని సర్టిఫికెట్ కూడా ఇచ్చినా, ఆర్డీఓ, ఎమ్మార్వో పట్టించుకోలేదు. సీజేఎఫ్ఎస్ పొలం ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందని నేను ఎమ్మార్వోను ప్రశ్నించగా… రాజకీయ వత్తిళ్లు ఉన్నాయని చెప్పారు. మా పొలాన్ని మాకు ఇప్పించి మాకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. టిడిపి అధికారంలోకి రాగానే రికార్డులను పరిశీలించి న్యాయం చేస్తానని యువనేత లోకేష్ హామీ ఇచ్చారు.