టిడిపి అధికారంలోకి రాగానే 167కె జాతీయ రహదారి నిర్మాణంలో ఎలైన్ మెంట్ మార్పులపై కేంద్రానికి లేఖరాస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం నంద్యాల నియోజకవర్గం కానాల రైతునగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. 167కె జాతీయ రహదారి నిర్మాణంలో మా పొలాలు పోతాయని గెజిట్ నోటిఫికేషన్ లో బయటపడింది. తర్వాత మేము ఆరా తీయగా అలైన్ మెంట్ విషయంలో అధికారపార్టీ కుట్ర బయటపడింది.
ఎమ్మెల్యే శిల్పా రవి వారి స్వార్థం కోసం ఎలైన్ మెంట్ మార్పించారని అర్థమైంది. మా ఎమ్మెల్యే శిల్పా రవి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మా ప్రాంతంలో వందల ఎకరాల్లో వెంచర్లు వేశారు. వారి వెంచర్లతో పాటు వారి బంధువులు, బినామీల వెంచర్లు కాపాడుకోవడానికి ఎలైన్ మెంట్ మార్చారు. జాతీయరహదారి నిబంధనల ప్రకారం దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఉన్నపుడు, గ్రామం రెండుగా విడిపోయేటప్పుడు మాత్రమే ఎలైన్ మెంట్ మార్చే అవకాశం ఉంది. నంద్యాల నుంచి జమ్మలమడుగు వెళ్లే రహదారిని అనేక ఒంపులు తిప్పుతూ అధికారపార్టీ నాయకుల వెంచర్లు తాకుతూ వెళ్లేవిధంగా ఎలైన్ మెంట్ మార్చారు. పేదరైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని వారి భూములు టార్గెట్ చేస్తూ రహదారి ఎలైన్ మెంట్ మార్చారు.
ఒక పథకం ప్రకారమే పెద్దల భూములకు విలువవచ్చే విధంగా ఎలైన్ మెంట్ మార్చారు. ఈ విషయమై మేము జాయింట్ కలెక్టర్ ను కలువగా ఆమె మమ్మల్ని దుర్భాషలాడి బెదిరించారు. అనేక ఆందోళనల తర్వాత మా సమస్యను జాతీయ రహదారి మంత్రిత్వశాఖ, మానవహక్కుల కమిషన్ కు తెలియజేశాము. కేవలం అధికార పార్టీ స్వార్థం కోసం పేదరైతులను ఇబ్బంది పెడుతున్నారు. మా సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చిన్న, సన్నకారు రైతులమైన మాకు న్యాయం జరిగేలా చూడండి. అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. అధికారపార్టీ నేతల అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ మాఫియాలుగా మారి అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుబడిని ప్రైవేటు భూములను సైతం బెదిరించి లాక్కుంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. జగన్ కు అధికారమిచ్చింది ప్రజలకు మంచిచేయడానికే తప్ప అధికారపార్టీ అడ్డగోలు దోపిడీకి లైసెన్సు ఇవ్వలేదు. భూమిపైనే ఆధారపడిన పేదరైతులకు అండగా నిలచి, వారికి న్యాయం జరిగేలా చూస్తాం అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.