టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాంతాలతో సంబంధం లేకుండా వాల్మీకిలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాప్దయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాలలో వాల్మీకి సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యల గురించి విన్నవించారు. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వాల్మీకి సామాజికవర్గీయులను ఎస్టీ జాబితాలో చేర్చాలి. ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాయలసీమ జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపడం దుర్మార్గం.
అన్నదమ్ముల్లా ఉన్న వాల్మీకిల మధ్య ప్రాంతీయ వ్యత్యాసాన్ని సృష్టించి అభద్రతాభావానికి గురిచేయడం దారుణం. టిడిపి అధికారంలోకి వచ్చాక కేంద్రంలో బిల్లు ఆమోదింపజేసి మాకు న్యాయం చేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. కులాల మధ్య గొడవలు పెట్టి చలికాచుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారింది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. వాల్మీకి బోయల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.