తనకు అంగబలం, అర్ధబలం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే, పదే చెబుతూ ఉంటారు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పేదవాడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటారు. పదే.. పదే అవే మాటలు చెబుతూ ప్రజల్ని సైతం నమ్మించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ ఉండదు.. కానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజంగానే అంత పేదవాడా..? ఆయన చెబుతున్నట్టుగా చేతిలో చిల్లిగవ్వకూడా లేదా..? అంటే ఆయన మాటలన్నీ పచ్చి అబద్దాలుగానే భావించాలి. ఎందుకంటే.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.
2019 ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులే.. సుమారు 510 కోట్ల రూపాయలు దాటేశాయి. ఇక.. బయటకు వెల్లడించని ఆస్తులు, షేర్లు, పెట్టుబడులు, బంగారువజ్రాభరణాల, వంటివన్నీ కలిపితే.. మార్కెట్ విలువ ప్రకారం ఆయన సంపద టాటా, బిర్లాలను దాటిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటారు. నిత్యం బీద అరుపులు అరిచే సీఎం జగన్ రెడ్డికి అంత సంపద ఎలా వచ్చింది..? ఏ రాజకీయ నాయకునికి సాధ్యం కానిది జగన్ రెడ్డికే ఎలా సాధ్యం అయ్యింది..? లెట్స్ వాచ్ ఇన్ డిటైల్స్…
సమకాలీన భారతదేశ రాజకీయాల్లో అపర కుబేరుడు లాంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా..? అంటే మొదటగా చెప్పుకోవాల్సింది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురించే. ఎందుకంటే.. అధికారికంగా నాలుగేళ్ళ క్రితం ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ అక్షరాలా 510 కోట్లు. ఈ నాలుగేళ్ళలో ఆయన సంపద ఎంత పెరిగి ఉంటుందో అనేది అంచనా వేసి చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే.. జగన్ రెడ్డిలో అంతర్గతంగా దాగి ఉన్న ధనదాహం.. మరే రాజకీయ నాయకుడిలో లేదనేది.. ఆయన సన్నిహితులు చెప్పేమాట. తెల్ల చొక్కా.. బిస్కెట్ కలర్ ఫ్యాంట్.. సాదా, సీదా చెప్పులతో సామాన్యుడిలా కనిపించటానికి ప్రయత్నించే జగన్ రెడ్డిలో.. బయటకు కనిపించని మరో మనిషి దాగున్నాడని అంటారు. ఆ బయటకు కనిపించని జగన్ రెడ్డి నిజస్వరూపం గురించి కథలు..కథలుగా చెబుతూ ఉంటారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 లో ముఖ్యమంత్రి కాక ముందు జగన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ కేవలం 9 లక్షల రూపాయలుగా చెబుతారు. 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులు సైతం ఆనాడు 2 కోట్ల రూపాయలకు దాటలేదు. కానీ.. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనూహ్యంగా జగన్ రెడ్డి సంపద.. వందలు, వేలు రెట్లు పెరిగింది. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా జగన్ రెడ్డి వందల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. 2009 కు ముందు కేవలం 9 లక్షల రూపాయల ఆస్తులు కలిగిన జగన్ రెడ్డి 2011 అసెంబ్లీ ఉప ఎన్నికల నాటికి తన ఆస్తులను 445 కోట్ల రూపాయలుగా చూపించారు. అంటే వైఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే జగన్ రెడ్డి సంపద 400 రెట్లకు పైగా పెరిగింది.
ఇక.. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి తన ఆస్తులను 416 కోట్లు.. 2019 నాటికి 510 కోట్లుగా జగన్ రెడ్డి చూపించారు. అయితే ఆయన లెక్క చూపని ఆస్తులన్నీ కలిపితే.. దీనికి ఐదారు రెట్లు కన్నా ఎక్కువ ఉంటుందని అంటారు. ఇంత అపార సంపద ఏ వ్యాపారం చేసి సంపాదించారో అంటే.. జగన్ రెడ్డి నుంచి నేటికీ సరైన సమాధానం రాకపోవటం గమనార్హం. ఇక, తనకు విపక్షాలు లాగా అవి లేవు.. ఇవి లేవు అని చెప్పే జగన్ రెడ్డి.. 2011 ఎన్నికల అఫిడవిట్లోనే తన భార్య భారతి వద్ద ఏకంగా 9 కేజీలకు పైగా బంగారు, వజ్రాభరణాలను ఉన్నట్టు చూపించారు. అదే విధంగా తన దగ్గర కూడా కేజీకి పైగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు వెల్లడించారు. అంటే భార్యబర్తలిద్దరికీ కలిపి ఆనాడే 10 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్న విషయం స్పష్టం అయినట్టే. ఈ పదేళ్ళలో వారు ఇంకెన్ని కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారన్నది తెలియాలంటే.. 2024 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ వరకు ఆగాలి.
ఇక.. స్థిరాస్తుల విషయానికి వస్తే..బెంగళూరులో ఇంద్రభవానాన్ని తలపించే జగన్ ప్యాలెస్ ముందు.. ఏ నిర్మాణమైనా దిగదుడుపే అంటారు. సుమారు 23 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ లో హెలిపాడ్, ఇండోర్ థియేటర్స్ వంటి ఎన్నో అధునాతన హంగులు ఉన్నాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ ప్యాలెస్ విలువే రెండు, మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంటారు. ఇక హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ రెడ్డి కట్టిన మరో ప్యాలెస్ కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నివాస గృహంగా ఈ ఇల్లు గుర్తింపు పొందింది. దీని విలువ కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటారు. 52 వేలకు పైగా చదరపు అడుగుల్లో నిర్మితమైన ఈ రాజభవనం కూడా జగన్ రెడ్డి తన అక్రమ సంపాదనతోనే కట్టారని సీబీఐ తన ఛార్జ్ షీట్లో ఏనాడో పేర్కొంది.
బెంగళూరు, హైదరాబాద్ లోటస్ పాండ్ తో పాటు.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో కూడా జగన్ రెడ్డి మరో అధునాతన భవనాన్ని నిర్మించుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ గా పిలవబడే ఈ భవనం విలువ కూడా వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంటారు. ఇప్పుడు తాజాగా.. విశాఖకు షిప్ట్ అవుతానంటున్న జగన్ రెడ్డి అక్కడ కూడా మరో ప్యాలెస్ ను కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ను తలదన్నేలా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా భారీ అంచనాలతో సీఎం అధికారిక నివాసంలో అన్ని హంగులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఏ సమాచారాన్ని బయటకు రాకుండా గోప్యత పాటిస్తున్నారు. మొత్తం మీద.. జగన్ స్థిరాస్థుల విషయాన్ని తీసుకుంటే.. కేవలం ఆయన నివాస సముదాయాల విలువే సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.
స్థిరాస్తుల్లో టాటా, బిర్లాను తలదన్నేసిన జగన్ రెడ్డి పేరిట అనేక కంపెనీలు ఉన్నాయి. సండూర్ పవర్ పేరుతో తన బినామీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన జగన్ రెడ్డి.. ఆ తరువాత పదుల సంఖ్యలో సూట్ కేసు కంపెనీలను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించారని సీబీఐ, ఈడీ తమ ఛార్జి షీట్లలో పేర్కొన్నాయి. సుమారు 31కు పైగా కేసులు జగన్ అక్రమ సంపాదనపైనే నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన ఇందిరా టెలివిజన్ పేరుతో సాక్షి ఛానల్ ను, సాక్షి పత్రికను సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు మీడియా సంస్థలను వైఎస్ భారత చూస్తున్నప్పటికీ.. దానికి సోల్ ప్రొప్రైటర్ మాత్రం జగన్ రెడ్డే అన్నది నిర్వివాదాంశం. ఇలా.. జగన్ రెడ్డి ఆస్తుల గురించి చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు కొండవీటి చాంతాడంత ఉంటుంది. వీటి విలువ లక్ష కోట్ల రూపాయల పైమాటే అనేది విపక్షాల మాట. వేల కోట్ల అక్రమాస్తులను పోగేసిన జగన్..తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని జనాల్ని నమ్మిస్తూ ఉంటారు. అపర కుబేరునికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఆస్తులు కూడబెట్టుకొని.. పైకి తానొక నిరుపేద అన్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. వినేవాళ్ళు అమాయకులైతే.. చెప్పేవాడు జగన్ రెడ్డి అన్న చందంగా.. ఆయన వ్యవహారశైలి తయారైంది.