నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విధ్వంసానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులు తిరగబడతున్నారు.. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన ప్రాంతంలో సెంటు భూమి పట్టాలు ఇవ్వటానికి నిరసనగా తుళ్లూరులో భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరిసన తెలిపారు. “సెంటు భూమి వద్దు.. టిడ్కో ఇళ్ళు ముద్దు” నినాదంతో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు మరింతగా ఉధృతం అవుతున్నాయి. ఆర్-5 జోన్‌కు వ్యతిరేకగంగా ఉద్యమిస్తున్న రైతులు దొండపాడు, నెక్కల్లు తదితర ప్రాంతాల్లో భూమి చదును పనులను అడ్డుకుంటున్నారు. రాజధాని భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేస్తే ఆత్మాహుతికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు.
అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేయటానికి ఓ పథకం ప్రకారం సీఎం జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేసిన ఆయన.. 48 వేల మందికి పట్టాలు ఇవ్వటానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సామాన్యుల ఇళ్ళ కోసం కేటాయించిన ప్రాంతంలో కాకుండా.. ఎలక్ట్రానిక్ సిటీ కోసం నిర్ధేశించిన ప్రాంతంలో ఫ్లాటింగ్ పనులు మొదలు పెట్టారు. దీంతో.. దొండపాడు, నెక్కల్లు తదితర గ్రామాల పరిధిలో భూమి చదును కార్యక్రమాలను అధికారులు మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
నివాసిత ప్రాంతాలను కాదని .. బయటి వారికి స్థలాలు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకున్నారు. ప్రభుత్వం కొత్తగా వేస్తున్న లే అవుట్ల వద్ద పెద్ద సంఖ్యలో రాజధాని రైతులు నిరసనలు తెలిపారు. పోలీసుల సాయంతో జరగుతున్న పనులను అడ్డుకున్నారు. ఈక్రమంలోనే ఆత్మాహుతికైనా సిద్ధమంటూ కొంత మంది మహిళలు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు.. రాజధానిలో ఇతర ప్రాంతాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించే ముసుగులో.. అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారంటూ.. తుళ్లూరులో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న రైతులు.. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి రాజధానిపై చిత్తశుద్ధి ఉంటే.. నివాసాలకు కేటాయించిన ప్రాంతంలోనే ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద.. అమరావతిపై జగన్ కుట్రలకు వ్యతిరేకంగా రాజధాని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.