15వ తేదీన వందరోజులు పూర్తిచేసుకుంటున్న యువగళం
ఆదేరోజు 175 నియోజకవర్గాలలో పాదయాత్రలు
ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 3వేలమంది పాల్గొనేలా దిశానిర్దేశం
కనీసం 7 కిలోమీటర్లకు తగ్గకుండా పాదయాత్ర చేయాలని అధినాయకత్వ సూచన
మహానాడు ఏర్పాట్లకు నేడు భూమిపూజ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రాజకీయ ప్రకంపనలు సృషిస్తోంది. రాయలసీమలో శ్రీకారం చుట్టిన పాదయాత్ర ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాలపరిధిలో 12వందలకు పైగా కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకున్నది. ఈ నెల 15 వ తేదీనాటికి పాదయాత్ర వంద రోజులు పూర్తిచేసుకొనున్నది. నారా లోకేష్ తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్రలో దీనిని ఒకమజిలీగా భావించవచ్చు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 15 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ కనీసం 7 కిలోమీటర్లు పాదయాత్ర జరుపాలని టిడిపి అధినాయకత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం మూడు వేలమందికి తగ్గకుండా పాదయాత్రలో పాల్గొనేలా చర్యలు చేపట్టాలని టిడిపి అధినాయకత్వం సూచించింది. దేశంలోనే అతి పెద్ద పాదయాత్రగా చరిత్ర సృష్టించేందుకు సన్నద్ధం అవుతున్న నారా లోకేష్ కు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంఘీభావం తెలుపనున్నాయి.
పాదయాత్ర ప్రారంభం అయిన జనవరి 27 వ తేదీన కుప్పంలో అన్ని నియోజకవర్గాల నాయకులు పాల్గొని నారా లోకేష్ కు సంఘీభావం తెలిపారు. అనంతరం వివిధ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. అదే క్రమంలో ఈనెల 15 వ తేదీన 175 నియోజకవర్గాలలో ఒకేసారి ప్రతి చోటా కనీసం 3వేలమందికి తగ్గకుండా పాదయాత్ర తలపెట్టడం అసాధారణ విషయంగానే భావించవచ్చు. ఒక వైపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేడుకలు ప్రపంచవ్యాక్తంగా నిర్వహిస్తున్నారు.
ఈనెల 28 వ తేదీన ఎన్టీఆర్ జన్మదినం నాటికి వంద ప్రదేశాలలో శతదినోత్సవ వేడుకలు నిర్వహించే దిశగా కార్యాచరణ కొనసాగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేసమయంలో 27,28 తేదీలలో రాజమహేంద్రవరంలో మహానాడును భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మహానాడు ఏర్పాట్లకు సంబంధించి వివిధ కమిటీల నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. మహానాడు వేదిక, సభాప్రాంగణం కు సంబంధించిన భూమిపూజ 12 వ తేదీన నిర్వహించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం నిత్యం ప్రజల మధ్యనే వుంటూ వారి సమస్యలపై పోరుబాట పట్టారు. ప్రస్తుతం రైతాంగ సమస్యలపై చంద్రబాబు పోరుబాట సాగిస్తున్నారు. 12వ తేదీన తణుకు పట్టణంలో చంద్రబాబు రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలివెళ్ళేందుకు సిద్ధంగా వున్నట్టు సమాచారం అందుతోంది. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయాలతో నిమిత్తం లేకుండా రైతులు సైతం సన్నాహాలు జరుపుతున్నారు.ఊపిరి సలుపని కార్యక్రమాలతో చంద్రబాబు, నారా లోకేష్ లు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు.