టిడిపి అధికారంలోకి వచ్చాక అసంపూర్తిగా నిలచిపోయిన కమ్యూనిటీ హాళ్లు పూర్తిచేసి, అవసరమైన చోట కొత్తవాటిని నిర్మిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం పాణ్యం నియోజకవర్గం రేమడూరు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో బోయ వాల్మీకి కమ్యూనిటీ హాలు నిర్మించాలి. బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. చట్టసభల్లో బోయలకు అవకాశం ఇవ్వాలి. హంద్రీ నదిలో చెక్ డ్యామ్ కట్టి నీటికొరత తీర్చాలి.
గ్రామంలో పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం కల్పించాలి. రేమడూరు నుండి నాగలాపురం వరకు లింకు రోడ్డు, రేమడూరు నుండి కొంగనపాడు వరకు తారురోడ్డు వేయాలి. నాయకల్లు నుండి లద్దగిరి వరకు తారురోడ్డు వేయాలి అని వారు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. టీడీపీ హయాంలో బోయలకు కమ్యూనిటీ హాళ్ల నిమిత్తం నిధులు, స్థలాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాం.
వైసిపి ప్రభుత్వం వచ్చాక వాటి పనులు నిలిపేసి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. బోయలను ఎస్టీల్లో చేర్చే అంశంపై సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా న్యాయం చేస్తాం. వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసింది. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇంటర్నల్, లింకు రోడ్ల నిర్మాణం చేపడతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.