టిడిపి అధికారంలోకి వచ్చాక పంట పెట్టుబడులు తగ్గిస్తాం
నకిలీవిత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు
వేదవతి ప్రాజెక్టును 8 టిఎంసిల సామర్థ్యం తో నిర్మిస్తాం
రైతులతో ముఖాముఖిలో యువనేత నారా లోకేష్
……
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, వెంకటాపురంలో రైతులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపడితే ఈ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించడమే కాకుండా పనులు చేపట్టలేదు. టీడీపీ అధికారంలోకి రాగానే పనుల్లో వేగం పెంచి సామర్థ్యం మళ్లీ 8 టీఎంసీలకు పెంచుతాం. ఆలూరు నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా దాహం తీర్చండని దారి పొడవునా ప్రజలు అడుగుతున్నారు. ఆలూరులో టీడీపీ గెలవకపోయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిన్నచూపు చూడలేదు. నగరడోన ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేశాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆలూరులో టీడీపీని ఆదరించండి, వేదావతి, నగరడోన ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికీ తాగు నీరందించే బాధ్యత తీసుకుంటాం.టమోటా ధర రోజుకో విధంగా మారుతోంది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పాడు..కానీ రైతులకు వచ్చింది క్రాప్ హాలిడే మాత్రమే. కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో రైతులు బాధ పడుతున్నారు. రూ.110 కోట్లతో టమోటా వాల్యూ చైన్ పథకాన్ని గతంలో రూపొందించాం. దాన్నీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
జగన్ పాలనలో సీమ రైతులకు అన్యాయం
సీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ సీమ రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశాడని ఆరోపించారు. నామమాత్రం సబ్సీడీతో నాసిరకం డ్రిప్ ఇస్తున్నారు. పత్తిరైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రాజ్యం తెస్తానని జగన్ ఊదరగొట్టారు. ఇప్పడు రైతు లేని రాజ్యంగా చేశాడు. మోటార్లకు మీటర్ల అగ్రిమెంట్లపై సంతకం పెట్టొద్దు. మీరు పగలగొట్టండి. మీకు అండగా మేముంటాం. ఎప్పుడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ మంత్రి కాకాణి కోర్టు దొంగ. జగన్ తోడు దొంగలందరూ సీబీఐ విచారణలో ఉన్నారు. రైతుల దగ్గరకు ఏనాడైనా మంత్రి వచ్చాడా? పెట్టుబడి తగ్గిస్తేనే రైతులకు లాభాలు వస్తాయి. బీమా సొమ్ము రైతులకు ఇవ్వాలన్న దానిపై సీఎం ఏనాడూ సమీక్షించలేదు. మేమొచ్చాక పాత బీమా విధానాన్ని ప్రవేశపెడతాం. కేంద్రం తో పోరాడి ఉపాధి కార్మికులకు గతంలో వేతనాలు పెంచాం..చేతినిండా పని కల్పించాం. హార్టికల్చర్ ను ఉపాధిహామీతో అనుసంధానం చేశాం. సబ్సీడీతో పశుగ్రాసం అందించాం. కర్నూలు జిల్లాకు పెట్టుబడులు తెచ్చేందుకు కర్నూలు చుట్టూ ఏపీఐఐసీ క్లస్టర్ ఏర్పాటు చేశాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. కర్నూలు జిల్లాలో వలసలు నిలువరిస్తాం అని వివరించారు.
కర్నూలు జిల్లాలో ప్రతిఎకరాకు నీరిస్తాం
టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి కర్నూలు జిల్లాలో ప్రతిఎకరాకు సాగునీరిస్తామని లోకేష్ చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జగన్ నిలిపేశాడు. టిడిపి హయాంలో హంద్రీనీవా 90 శాతం పనులు పూర్తిచేస్తే మిగిలిన 10 శాతం కూడా జగన్ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. రూ.150 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తవుతాయి..కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. గోదావరి మిగులు జలాలను సీమకు తెస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు. సీమలో పాదయాత్ర పూర్తయ్యాక సుధీర్ఘంగా చర్చించి రాయలసీమకు ఏం చేయాలనేది మేనిఫెస్టోలో పెడతాం. రాయలసీమ రైతాంగం మాత్రమే కాదు ఇతర ప్రాంతాల్లో రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు నష్టపోతున్నారు.గతంలో ఖరీఫ్ సీజన్ లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరిస్తే జగన్ ప్రభుత్వం కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది. పైగా ఇంకా రైతులకు ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించలేదన్నారు.
రబీలో ధాన్యం పరిస్థితి ఏమిటి?
రబీ లో జగన్ ప్రభుత్వం అసలు ధాన్యం కొనుగోలు పాలసీనే ప్రకటించలేదు. అసలు ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి ఉంది అని లోకేష్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రబీలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే. కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడానికి ప్రభుత్వం సిద్దం అవుతుంది. పైగా డబ్బులు లేవని చెబుతుంది. దీని వలన వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యే ప్రమాదం ఉంది. తద్వారా వరి రైతులకి ఎనలేని నష్టం జరిగే ప్రమాదం ఉంది. రైతులు పండించిన ప్రతి గింజా కొంటాను అన్న జగన్ హామీ ఏమయ్యింది? రబీ ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించాలి. మొదట ఎవరు వస్తే వారి ధాన్యం మాత్రమే కొంటాము అనే ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు. దీని వలన రైతులు తీవ్ర నష్టం కలుగుతుంది. రైతులందరి దగ్గరా ప్రభుత్వం ధాన్యం సేకరించాలి అని డిమాండ్ చేశారు.
రైతులతో ముఖాముఖి
నగరడోన రిజర్వాయర్ ను పూర్తి చేసి సాగునీరు అందించాలి. వేదవతి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4 టీఎంసీలకు తగ్గించారు. 8 టీఎంసీల సామర్థ్యం ఉంచాలి. నష్టాలతో రైతులు వలసపోతున్నారు. వలసలు నివారించాలి. టమోటా, ఉల్లి రైతులను ఆదుకోవాలి. టమోటాలు రోడ్డున పోసి నిరసన తెలిపినా మంత్రి తొక్కించుకుంటూ పోతున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలతో రైతులు దారుణంగా నష్టపోయారు.. విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాలకు పరిహారం అందలేదు. జింకలబెడద ఎక్కువగా ఉంది..వాటిని అడవులకు తరలించాలి అని
రైతులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
తిరుమలయ్య, రామదుర్గం : నగరడోన రిజర్వాయర్ ద్వారా గ్రామాల్లోని చెరువులకు నీళ్లు నింపాలి. పనుల్ని ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు. మీరొచ్చాక పూర్తి చేయండి.
రాజశేఖర్, టమోటా రైతు : టమోటాకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోస్తున్నాం. మా దగ్గర కిలో రెండు రూపాయలకు కొంటున్నారు. వాళ్లు బాక్సు వందల్లో అమ్ముకుంటున్నారు. ఆస్పర మండలంలో వలసలు ఎక్కువయ్యాయి. టమోటా జ్యూస్ పరిశ్రమపై ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరసన తెలిపే సమయంలో టమోటాలు రోడ్లపై పడేస్తే బెంజ్ మంత్రి తొక్కుకుంటూ పోయారు తప్ప స్పందించలేదు.
సుమన్ యాదవ్ : వేదవతి ప్రాజెక్టును టీడీపీ హయాంలో 8 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. కానీ ఈ ప్రభుత్వం 4 టీఎసీంలకు తగ్గించింది..అయినా పనులు చేపట్టలేదు.
లక్ష్మణ్ యాదవ్ : మేము ఉల్లిసాగు చేస్తాం. గతంలో మాకు క్వింటాకు రూ.250లు సబ్సీడీ అందేది. కానీ ఇప్పుడు రావడం లేదు. ఉల్లిరైతులను ఆదుకోవాలి.
బి.ఆంజనేయులు, దేనకల్లు : సంక్రాంతి తర్వాత ఈ ప్రాంతం నుండి వలసలు ఎక్కువయ్యాయి. ఉపాధి హామీ కూలీలకు పని చేసిన మేర కూలీ అందడం లేదు. కుటుంబాలను పోషించుకునేందుకు సుదూర ప్రాంతాలకు వలసవెళ్తున్నాం. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న జయరాం పట్టించుకోవడం లేదు.
కె.మాధవులు : 6 మండలాల్లో 15 వేల ఎకరాల్లో పత్తి నాటాము. నకిలీ విత్తనాలు ఇష్టానుసారంగా రైతులకు ఇచ్చారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు సోలార్ పంపు సెట్టు ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఆలూరు పరిధిలో 18 మంది రైతులు చనిపోయారు.