టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నం.217 ను రద్దుచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజకవర్గంలోని వరదాయపల్లే బెస్త సామాజిక వర్గ నేతలు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు. వైసీపీ ప్రభుత్వం జీవో నం.217 తీసుకు వచ్చి తమ పొట్టకొడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
చెరువులలో పెంచుకునేందుకు చేపపిల్లలను సబ్సిడీపై అందించి బెస్త సామాజిక వర్గ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వారిని చూసి కిందిస్థాయి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అని ఆరోపించారు. పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి మార్గాలు చూపించాల్సిన జగన్ రెడ్డి వారి రక్తాన్ని పీలుస్తూ, వారు నోటికాడ కూడా లాక్కుని రాక్షససానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు.