యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వైసీపీ అక్రమాలను బయటపెడుతుండడంతో జగన్ తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజా సేవ పేరుతో జనం సొమ్మును లూటీ చేస్తున్న నేతల బండారాన్ని లోకేష్ బట్టబయలు చేస్తున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సాగే పాదయాత్రలో, వైసీపీ నేతల అరాచకాలను ఎండగడుతూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్.
లోకేష్ యువగళం పాదయాత్రతో అధికార వైసీపీ కువసాలు కదిలిపోతున్నాయి. వైసీపీ నేతల అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేవరకు తగ్గేదేలేదంటూ ముందుకు సాగుతున్న లోకేష్, ఎమ్మెల్యేల అవినీతి ఆగడాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ ప్రజల ముందు ఉంచుతున్నారు. దీంతో, లోకేష్ పాదయాత్ర తమ నియోజకవర్గంలోకి వస్తోందనే వార్తలతోనే వైసీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. పుంగనూరు, రాప్తాడు, ధర్మవరం సహా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు, అక్రమాలను బయటపెడుతూ చీల్చిచెండాడుతున్నారు లోకేష్.
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లోగుట్టును లోకేష్ బయటపెట్టారు. కోడిగూయగానే నిద్రలేస్తున్న కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ వచ్చి…. కొండలు, గుట్టలు కాజేస్తున్నాడంటూ సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచారు. ఆధారాలతో సహా ఎమ్మెల్యే భూ కబ్జా బాగోతాలను తన పాదయాత్రలో బట్టబయలు చేశారు. ఎర్రగుట్టపై ఎమ్మెల్యే 20 ఎకరాలు కబ్జా చేసి విలాసవంతమైన భవనంతో పాటు తోటలు, బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారని లోకేష్ తెలిపారు. కేతిరెడ్డి ఆక్రమించిన ప్రదేశంలో సెల్ఫీ దిగి… ఆయన ఎంతటి అవిననీతి పరుడో నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. అంతేకాదు, తమ ప్రభుత్వం వచ్చాక కేతిరెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయిస్తామని స్పష్టం చేశారు. దాంతో, రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల జరిగుండొచ్చంటూ ఎమ్మెల్యే బొంకుతున్నప్పటికీ, ఆయన అవినీతి బాగోతమంతా వెలుగులోకి రావడంతో, కేతిరెడ్డికి ఇక బ్యాడ్ మార్నింగ్ స్టార్ట్ అయినట్టేనని అంతా భావిస్తున్నారు. కేతిరెడ్డి మహా కన్నింగ్ అని తెలుసుకుని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అంతకుముందు రాప్తాడు పాదయాత్రలోనూ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భూదందాను ఎండగట్టారు లోకేష్. ఎమ్మెల్యే, ఆయన తండ్రి, సోదరులు అంతా కలిసి నియోజకవర్గాన్ని దోచుకుతింటున్నారంటూ విరుచుకుపడ్డారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అభివృద్ధిలో వీక్, అవినీతిలో మాత్రం తోపుగా మారారని లోకేష్ మండిపడ్డారు . ఇద్దరు సీఐలను అడ్డం పెట్టుకుని రైతులు, రియల్టర్ల భూమిని దోచుకోవడం దగ్గర్నుంచి…విశాఖలో ఉన్నభూముల వరకు సాగుతున్న తోపుదుర్తి అవినీతిని బయటపెట్టారు. ఎమ్మెల్యే సోదరుడు ఒకరు కోటి రూపాయల భూమి ఆక్రమిస్తే మరొక అన్న 30 కోట్ల విలువైన భూములు దోపిడీ చేసిన తీరును ఎండగట్టారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో తన కళ్లముందే తొమ్మిది టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలి వెళ్లిన వెషయాన్ని సెల్ఫీ తీసుకొని వాస్తవాలను ప్రజల ముందు పెట్టారు లోకేష్. ఇక, టీడీపీ హయాంలో తీసుకొచ్చిన జాకీ కంపెనీని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, 17 కోట్లు డిమాండ్ చేయడంతో… ఆ కంపెనీ వెనక్కి తరలిపోయిన విషయాన్ని లోకేష్ ప్రజల ముందు ఉంచారు. రాక్రీట్ కంపెనీ పేరుతో తోపుదుర్తి 280 కోట్లు స్వాహా చేసిన వైనాన్ని ఎండగట్టారు. మొత్తంగా, ఎన్నికలకు ముందు తన బనియన్లకు చిల్లులు పడ్డాయని చెప్పిన దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి….ఎమ్మెల్యే అయ్యాక నాలుగేళ్ల కాలంలో వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని, తాము అధికారంలోకి వచ్చాక అంతా కక్కిస్తామని అన్నారు.
ఇక, పుంగనూరులో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…. నియోజకవర్గంలో ఏవిధంగా దోపిడీకి పాల్పడుతున్నారో…యువగళం పాదయాత్రలో లోకేష్ మొత్తం బయటకు తీశారు. పుంగనూరు, పెద్దిరెడ్డి, పాపాలు…అనే పీ 3 ఫార్ములా అమలవుతోందని, నియోజకవర్గంలో ఒక్క పనికూడా జరగలేదని లోకేష్ దుయ్యబట్టారు. తన అక్రమాలకు కాదేది అనర్హం అన్నట్లుగా ల్యాండ్, సాండ్, మట్టి ఇలా దొరికిందల్లా దోచుకుతింటున్నారని పెద్దిరెడ్డిపై లోకేష్ నిప్పులు చెరిగారు.జగన్ రెడ్డి రాష్ట్రానికి అమూల్ డైరీని తీసుకొచ్చారని… కానీ పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ కనిపించడం లేదన్నారు. పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డైరీ కోసమే అమూల్ ను నియోజకవర్గంలో లేకుండా చేశారనే వాస్తవాలను వెలికితీశారు. పాలకు తక్కువ ధరను చెల్లిస్తూ పాడి రైతులకు పెద్దిరెడ్డి చేస్తున్న మోసాన్ని లోకేష్ బయటపెట్టడంతో…మంత్రి ఎంతటి నయవంచకుడో రైతులు తెలుసుకున్నారు. అటవీశాఖ భూములను, ఆఖరికి దేవుడి భూములను కూడా వదిలిపెట్టకుండా పెద్దిరెడ్డి సాగిస్తున్న దందాలన్నీ లోకేష్ పూసగుచ్చారు. పెద్దిరెడ్డి దోచుకు తిన్న 10వేల కోట్లను వడ్డీతో సహా రాబట్టి, పుంగనూరు ప్రజలకు కానుకగా ఇస్తామన్నారు లోకేష్.
ప్రస్తుతం శింగనమల పాదయాత్రలో ఉన్న లోకేష్, ప్రజాసమస్యలు పట్టని స్థానిక ఎమ్మెల్యే తీరును తూర్పారబట్టారు. 46వేల ఓట్లతో శింగనమల ప్రజలు జొన్నలగడ్డను గెలిపిస్తే, అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారని లోకేష్ నిప్పులు చెరిగారు. ఆమె పేరుకే ఎమ్మెల్యే అని పెత్తనం మొత్తం ఆమె భర్త సాంబశివారెడ్డి చెలాయిస్తున్నారని లోకేష్ పైర్ అయ్యారు. పద్మావతి వారానికి ఐదు రోజులు బెంగళూరులో ఉంటే, రెండ్రోజులు మాత్రమే అనంతపురంలో ఉంటుందన్నారు. ఇక, నియోజకవర్గంలో సాంబశివారెడ్డి కనుసన్నల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, మట్టి, ఇసుకను దోచుకుతింటున్నారని అన్నారు. విద్యాశాఖ సలహాదారుడిగా ఉన్న సాంబశివారెడ్డి కాలేజీల నుంచి కమీషన్లు నొక్కేస్తున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో 500ఎకరాలను లూటీ చేశారని తెలిపారు. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే, టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతునన్నారని ఫైర్ అయ్యారు.
మొత్తంగా, లోకేష్ త్వరలో పాదయాత్ర చేయనున్న మరికొన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేల అక్రమాలు బయటపెట్టే అవకాశముందని ప్రజలు భావిస్తున్నారు.