అభివృద్ధి చేయడం అంటే, ఉన్నవాటికి రంగులు వేయడం కాదని సీఎం జగన్ రెడ్డికి చురకలంటించారు టిడిపి యువనేత నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా ఆదివారం ధర్మవరం 28వవార్డులో టిడ్కో గృహాలను లోకేష్ పరిశీలించారు. తాను ఇటుగా వస్తున్నానని, ఆగమేఘాల మీద టిడ్కో ఇళ్లకి రంగులు వేయిస్తోన్న వైసీపీ సర్కారు నాలుగేళ్లుగా వీటిని పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సమస్యలు లోకేష్‌కి వివరించారు.
టిడ్కో లబ్ధిదారులు ఏమన్నారంటే..
• గత ప్రభుత్వ హయాంలో ధర్మవరంలో పేదలకోసం రూ.600 కోట్ల వ్యయంతో 8,832 టిడ్కోగృహాల నిర్మాణం చేపట్టింది.
• లబ్ధిదారుల వాటాగా వివిధ కేటగిరీలకు నిర్ణయించిన మొత్తం 68లక్షల రూపాయలు చెల్లించాం.
• 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1440 టిడ్కోగృహాలకు లబ్ధిదారుల పేర్లు మార్చి వైసిపి కార్యకర్తలను చేర్చారు.
• గత ప్రభుత్వ హయాంలోనే 80శాతానికి పైగా పూర్తయిన టిడ్కో ఇళ్లను గత నాలుగేళ్లుగా మాకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
• టిడిపి ప్రభుత్వం వచ్చాక గతంలో టిడ్కో ఇళ్లనిర్మాణాన్ని పూర్తిచేసి గత ప్రభుత్వ హయాంలో ఎంపికచేసిన 8,832మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించాలి.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…
• ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక ఏడాదికి 5లక్షల ఇళ్లు కట్టిస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్లలో కట్టింది నాలుగు ఇళ్లు మాత్రమే.
• కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాని జగన్ మేం కట్టిన ఇళ్లకు మాత్రం సిగ్గులేకుండా రంగులు వేసుకుంటున్నారు.
• పేదవాడు కూడా సౌకర్యవంతమైన ఇళ్లలో నివసించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో 5లక్షల టిడ్కో గృహాలను గ్రౌండింగ్ చేశాం.
• ఈ ప్రభుత్వం వచ్చాక కుంటిసాకులతో దాదాపు సగం ఇళ్లను రద్దుచేసింది.
• గత ప్రభుత్వంలోనే దాదాపు 90శాతం పూర్తయిన 2.62లక్షల టిడ్కో ఇళ్లను మిగిలిన 10శాతం పూర్తిచేసి ఇవ్వకుండా గత నాలుగేళ్లుగా పాడుబెడుతోంది.
• టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో ఎంపికచేసిన లబ్ధిదారులందరికీ ఇళ్లు పూర్తిచేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.