తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు. తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికింది. నాలుగు గోడల మధ్యకే పరిమితం అయిన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరింది. మదారాసీ పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగుజాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారు. చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తం అయింది. నారా లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వన్నె తెస్తున్నారు.
దేశంలోనే తెలుగుదేశం పార్టీ కి ఒక ప్రత్యేకత వున్నది. దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందువరుసలో వుంది. వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురుకాలేదు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం అందుకు ప్రధాన కారణం. తెలుగునేలపై అతిపెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీ స్వంతం.
40 ఏళ్ల తర్వాత కూడా తెలుగునాట 40 శాతం ఓటింగ్ కలిగి వుండటం సాధారణ విషయం కాదు. 2019 ఎన్నికలలో అతితక్కువ స్థానాలకు పరిమితం అయినప్పటికీ టిడిపికి 40 శాతం ఓట్లు రావటం గమనార్హం. టిడిపి ఆవిర్భావం నుంచి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే రాజకీయ పోరాటం జరిపింది. ఆ పార్టీని కూకటివేళ్లతో పెకలించి 1983 వ సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుజాతి సత్తాను ప్రపంచానికి చాటారు. కేవలం అధికారం చేపట్టడమే గాక, తెలుగుజాతి గౌరవాన్ని, ప్రతిష్టను పెంపొందించడం, తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, పేద, బడుగు, బలహీన వర్గాలలో జీవనరేఖలు వికసింప చేయటం వంటి అంశాలు రాష్ట్ర చరిత్రలో టిడిపికి చెరగని ముద్ర వేశాయి.
టిడిపి మూల సిద్ధాంతం లోనే సామాజిక న్యాయం ఇమిడి ఉన్నది. ఎన్టీఆర్ తొలి కేబినెట్ ను పరిశీలిస్తే సామాజిక న్యాయం ఏ స్థాయిలో అమలైంది అవగతమవుతుంది. అత్యంత కీలకమైన శాఖలను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించారు. నేటికీ సామాజిక న్యాయం నూరుశాతం అమలవుతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అంటే అతిశయోక్తి కాదు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని విధంగా అత్యున్నత స్థాయిలో విధాన నిర్ణాయక మండలి (పోలిట్ బ్యూరో) ఒక్క టిడిపికి మాత్రమే వుంది. ఆ మండలిలో సభ్యుల సామాజిక వర్గాలను పరిశీలిస్తే టిడిపిలో అసలైన సామాజిక న్యాయం అమలవుతున్న విషయం స్పష్టమవుతుంది. టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు సంక్షేమం అన్న పదానికి భాష్యం చెప్పాయి.
ఆ పథకాలు దేశ రాజకీయాలకు ఒక ప్రామాణికంగా, దిక్సూచిగా మారాయి. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టడం అప్పట్లో ఒక చరిత్ర. ఆ పథకం దేశవ్యాప్తంగా ఆహారభద్రత చట్టం రూపకల్పనకు దారితీసింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ లు, పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, తెలుగు గ్రామీణ క్రాంతి పథం వంటి పథకాలు, వివిధ రకాల పేర్లతో నేటికీ చలామణి అవుతూనే వున్నాయి. అనంతరం పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల స్వారీ మాదిరి పరుగులు పెట్టించారు. ఎప్పటికప్పుడు అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనకు జోడించి గుడ్ గవర్నెన్స్ కు రూపకల్పన చేసి ప్రపంచమంతా తెలుగునేల వైపు తలతిప్పి చూసేలా చేశారు. ఐటి విప్లవాన్ని సృష్టించారు. యువతను ఉద్యోగాల కోసం వెంపర్లాడే స్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి పారిశ్రామిక వెత్తలుగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచంలో అగ్రగాములుగా గుర్తింపు పొందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తెలుగు పారిశ్రామిక వేత్తలు కీలక భూమిక పోషిస్తున్నారంటే అందుకు చంద్రబాబు దూరదృష్టితో చేపట్టిన నిర్ణయాలే కారణం.
తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రాజకీయాధికారం భాగస్వామ్యం కల్పించింది. తెలంగాణ లో పటేల్, పట్వారీ వ్యవస్థల రద్దు తో వెనుకబడిన వర్గాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాయి. నేడు తెలంగాణ లో వివిధ పార్టీలలో ఉన్నత స్థానాలలో వున్న బిసి నాయకులలో చాలామందికి తెలుగుదేశం పార్టీయే రాజకీయంగా జన్మనిచ్చింది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్ లు కల్పించటం ద్వారా బిసి వర్గాలు స్థానిక స్వపరిపాలన లో భాగస్వాములు అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలోనూ పార్టీ అధ్యక్షులుగా బిసి వర్గాలకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్ లు కొనసాగుతున్నారు. వర్తమాన రాజకీయాల్లో పూటకొక పార్టీ మారుతున్న నాయకులు మనకు తారస పడుతున్నారు. అయితే గత 40 సంవత్సరాలుగా రాజకీయ ఒడిదుడుకులు, వత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు కు లొంగకుండా ఓకే పార్టీ లో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నాయకులు టిడిపిలో పదుల సంఖ్యలో వున్నారు. ఈ అరుదైన ఘనత మరే ఇతర ప్రాంతీయ పార్టీలోనూ కానరాదు.
అంతేగాక క్షేత్ర స్థాయిలోనూ నాలుగు దశాబ్దాలుగా ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీ పతాకం మోస్తున్న కార్యకర్తలు తెలుగునేల నలుచెరగులా వున్నారు. కుల, మత, వయో,లింగ భేదాలకు అతీతంగా వున్న కార్యకర్తల శ్రేణి టిడిపికి రక్షాకవచంగా వుంది. టిడిపికి చంద్రబాబు వంటి నాయకుడు తరగని ఆస్తి. చంద్రబాబు నాయకత్వంలో సుశిక్షితుడైన సైనికుని తరహాలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులలో పోరాట స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విధంగా తెలుగుజాతి చరిత్రపై చెరగని పచ్చబొట్టు లా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నేడు నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకొని 41 వ ఏట అడుగు పెట్టింది. ఇదే సంవత్సరం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు రావటం విశేషం. ఈ సందర్భంలో మరో నాలుగు దశాబ్దాల పాటు పార్టీని తిరుగులేని శక్తిలా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.