వైసీపీ నాయకత్వం తమ పార్టీలోని అంతర్గత విభేదాలను టిడిపికి ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. తమ అధినాయకుని నిరంకుశ వైఖరి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు నచ్చక కొంతమంది సభ్యులు వైసీపీ నాయకత్వం పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇటీవల జరిగిన శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ప్రజాతీర్పు కొంతమంది అధికార పార్టీ సభ్యులను సైతం ఆలోచనలో పడవేసింది. ఫలితంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో నలుగురు సభ్యులు అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేశారు.
వాస్తవానికి శాసనసభ గెజిట్ ప్రకారం తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యుల బలం వుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికలో టిడిపి కి 23 మంది సభ్యులు ఓటు వేశారు. ఓటింగ్ రహస్య పద్ధతిలో జరిగినందున ఎవరికీ ఎవరు ఓటు వేశారనే విషయం బహిర్గతం అయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ వైసీపీకి చెందిన నలుగురు సభ్యులు టిడిపి కి ఓటు వేసారనే నెపంతో ఆ పార్టీ నాయకత్వం వారిని సస్పెండ్ చేసింది. అది పూర్తిగా వైసీపీ అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ ఆ పార్టీ నాయకులు తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు యధావిధిగా నే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మీద బురద చల్లనారంభించారు. తమ పార్టీ సభ్యులను చంద్రబాబు ప్రలోభ పెట్టారు అంటూ గగ్గోలు పెట్టసాగారు.
వైసీపీ అధినేత పట్ల ఆ పార్టీలో అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తిని టిడిపికి అంటగట్టడం ఆపార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. రహస్య ఓటింగ్ లో ప్రత్యేకించి నలుగురు సభ్యులు టిడిపి కి ఓటు వేశారని ఏ ఆధారంతో చెప్పగలరు. టిడిపి తరపున గెలుపొందిన మొత్తం 23 మంది సభ్యులు పార్టీ ఇచ్చిన విప్ ను గౌరవించి టిడిపి అభ్యర్థికి ఓటు వేశారని భావించవచ్చు కదా. కానీ వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పై ఆరోపణలు చేసే నీచానికి దిగజారారు. ఒక పక్క ప్రజలలో తిరుగుబాటు, మరోవైపు సొంత పార్టీలో పెరుగుతున్న దిక్కార ధోరణులతో వైసీపీ నాయకత్వం పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని స్పష్టమవుతోంది. చంద్రబాబు అనుమతించిన పక్షంలో వైసీపీ ఎమ్మెల్యేల లో చాలామంది ఆపార్టీని వేసేందుకు సిద్ధంగా వున్న వాతావరణం కనిపిస్తోంది. అటువంటప్పుడు వారిని ప్రలోభ పెట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? టిడిపి పై అసంబద్ధ ఆరోపణలతో వైసీపీ నాయకుల్లో వున్న అసహనం మరోమారు బహిర్గతం అయింది.