రాష్ట్రంలో నలుగురు టిడిపి ఎమ్మెల్సీలు గెలవడంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ది లక్కీ లెగ్గని తేలిపోయిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తేల్చి చెప్పారు. జనవరి 27 న కుప్పంలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా దాటకముందే మూడు పట్టభద్రుల నియోజక వర్గాలలో టిడిపి అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా గెలిచారని చెప్పారు. అనంతపురం జిల్లాలో పాదయాత్ర ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను టిడిపి అభ్యర్థి గెలిచారని తెలిపారు. ఇదంతా లోకేష్ పాదయాత్ర మహిమ అన్నది వైకాపా నేతలు గుర్తించాలని చెప్పారు.
ఈ ఫలితాలను చూసిన తరువాత అయినా మంత్రి రోజా వక్ర బుద్ధితో లోకేష్ పై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. టిడిపి ఏర్పడిన 40 ఏళ్లలో తొలిసారిగా పశ్చిమ, తూర్పు రాయల సీమ పట్టభద్రుల నియోజక వర్గాలలో పార్టీ అభ్యర్ధులు గెలిచారని చెప్పారు. రాయల సీమలో ” బిడ్డ పుట్టిన వేల గొడ్డు వచ్చిన వేల” అన్న నానుడి ఉందని చెప్పారు. దాని ప్రకారం లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన వేళా విశేషం వల్ల నలుగురు ఎమ్మెల్సీలు అనుకోని విధంగా విజయం సాధించారని చెప్పారు. వైకాపా నేతలు కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనాలని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదని తెలిపారు .
టిడిపి అభ్యర్ధులు పైసా ఖర్చు పెట్టకుండా గెలిచారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 నియోజక వర్గాలలో ఏడు లక్షలకు పైగా ఓట్లు వేసిన పట్టభద్రులు ఇచ్చిన తీర్పు ప్రజల అభీష్టానికి అద్దం పట్టిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్ ను ప్రజలు ఓడించి రికార్డ్ సృష్టిస్తారని ఆయన జోస్యం చెప్పారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాలను టిడిపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో విర్రవీగుతున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ కె రోజా రెడ్డి, కళత్తూరు నారాయణ స్వామి కూడా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రారంభమైన చంద్రబాబు పవనాలు ఎన్నికల నాటికి సునామిగా మారుతాయని చెప్పారు. బాబు సునామీలో జగన్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుని పోతుందని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.