హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈనెల 29 న జరుగనున్న తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహణ ఏర్పాట్లను సోమవారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ప్రధాన సభా వేదిక, వేదికపై ఎల్ఈడి స్క్రీన్, వి ఐ పి గ్యాలరీ, పార్టీ ప్రతినిధులు కూర్చునే స్టాండ్స్, మీడియా గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, బారికేడ్లు, ఇతరత్రా నిర్మాణ పనులను సమీక్షించారు. అవసరమైన మార్పులు, చేర్పులను సూచించారు.
సభకు హాజరయ్యే ముఖ్య నేతలకు, పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పక్కగా ఏర్పాట్లు చేయాలని సభా నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. వేసవి ఎండల దృష్ట్యా సభికులకు ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చునేలా పాసులు సిద్ధం చేయాలని, సభ మధ్యలో అవరోధాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని నిర్వాహకులకు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.
కాసాని వెంట పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, టిటిడిపి మీడియా కో- ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నేతలు అట్లూరి సుబ్బారావు, కాసాని వీరేశ్, బుగిడి అనూప్, బాలసుబ్రహ్మణ్యం, రవీంద్రా చారి, సాంబశివరావు, వెంజల కిషోర్, జోగేందర్ సింగ్, తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు.