అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని, దాతలు ముందుకు వచ్చి వదర బాధితులకు సహాయం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై ప్రజలు కట్టుబట్టలతో నిస్సహాయ స్థితిలో వున్నారని తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, మానవత్వాన్ని మరచిందని మండిపడ్డారు. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని, కూరగాయలు, బియ్యం లేక ప్రజలు, పాలు లేక పసి బిడ్డలు దుర్భర స్థితిలో వున్నారని వివరించారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుండి 7 రోజులు నిల్వ ఉండిపోయాయినట్లు తెలిపారు. ఇళ్లలో బురద పేరుకుపోయిందని, ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంటిలో వున్న అన్ని వస్తువులు పనికిరాకుండా పోయిన దృశ్యాలు తన పర్యటనలో చూసినట్లు పేర్కొన్నారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని విమర్శించారు. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకోవాలని, ఇప్పటికే ఎన్‌టిఆర్ ట్రస్ట్ కొంత మేర సాయం అందించిందని, ఇంకా సాయం కొనసాగిస్తోందని తెలిపారు. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా వున్నదన్నారు. దాతలు వారి పేరుతోగానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించవలసిందిగా దాతలను కోరారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎండుగడ్డి, కూరగాయలు, బియ్యం అందించవలసిందిగా నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.