(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
స్వాతంత్రం సిద్ధించి ఏడున్నర దశాబ్ధాలు గడిచినా ఇప్పటికీ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం అంతంత మాత్రంగానే ఉంది. దైనందిన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలు రాజకీయాల్లో రాణించడం నేటి పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. కనీస సౌకర్యాలు లేని ఒరిస్సాలోని మారుమూల కుగ్రామంలో జన్మించిన ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం యావత్ మహిళాలోకానికే గర్వకారణం. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 50శాతానికి పైగా సీట్లు సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికై తాజాగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపతి ముర్ము జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు భారతదేశ ప్రథమ మహిళ స్థానానికి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా, దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు.
మారుమూల కుగ్రామం నుంచి డిల్లీదాకా!
ఒరిస్సాలోని మయూర్ భంజ్ జిల్లా ఉపర్ బెడ గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే గిరిజన కుటుంబంలో జన్మించిన ద్రౌపతి ముర్ము కటిక పేదరికాన్ని అనుభవించారు. ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే సమయానికి ఆమె స్వగ్రామంలో విద్యుత్ సౌకర్యమే లేదంటే ఎటువంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొందో అర్థం చేసుకోవచ్చు. అనేక కట్టుబాట్లు, పేదరికం నడుమ అన్ని సవాళ్లను అధిగమించిన ముర్ము భువనేశ్వర్ లోని రమాదేవి ఉమెన్స్ కాలేజిలో డిగ్రీ పూర్తిచేసి కుటుంబానికి అండగా నిలబడేందుకు ఉపాధ్యాయురాలిగా కెరీర్ ను ప్రారంభించారు. అయితే జీవితంలో స్థిరపడకముందే శ్యామ్ చరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అయితే భర్త, కుమారులు ఇద్దరూ చనిపోవడంతో ఆమె జీవితంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత ప్రజాసేవకే ఆమె జీవితాన్ని అంకితం చేశారు.
కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి దాకా!
గిరిజన సంఘం నుండి వచ్చిన ముర్ము ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1997లో రాయ్‌రంగాపూర్ కౌన్సిలర్‌గా పోటీచేసిన ముర్ము విజయంతోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ముర్ము సామాజిక సేవాభిలాషను గమనించిన భారతీయ జనతాపార్టీ ఆమెను ఒరిస్సా షెడ్యూల్డ్ ట్రైబ్స్ మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమించింది. తాను రాజకీయ అరంగేట్రం చేసిన రాయ్‌రంగాపూర్ నియోజకవర్గం నుంచే 2000వ సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒడిశాలో బీజేపీ, బీజేడీ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో వాణిజ్య, రవాణా శాఖలతోపాటు ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ విభాగాల మంత్రిగా సేవలు అందించారు. 2000 నుంచి 2004 వరకు మంత్రి పదవిలో కొనసాగిన ఆమె.. 2015లో జార?ండ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. వివాద రహితురాలిగా పేరొందిన ద్రౌపదికి.. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు అధికారపక్షమే కాకుండా ప్రతిపక్ష నేతల నుంచి కూడా మన్ననలు పొందడం విశేషం.
వరుస విషాదాలకు ఎదురొడ్డి నిలబడి…
దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ద్రౌపది ముర్ము తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక కుమారుడు మరణించాడు. ఈ విషాదం నుంచి తెరుకునే లోపే, 2012లో రోడ్డు ప్రమాదంలో మరో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. భర్త శ్యామ్ చరణ్ ముర్ము గుండెపోటుతో మరణించారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే ఆమెకు అన్నీ. కూతురుకు వివాహమై ఒక పాప కూడా ఉంది. తీరిక చిక్కినప్పుడల్లా చిన్నారి మనవరాలితో ఆడుకుంటారు ద్రౌపది ముర్ము. ద్రౌపతి ముర్ము రాజకీయ ప్రస్థానం… రాజకీయాలపై ఆసక్తితో ఉన్న మహిళాలోకానికి ఆశాకిరణం లాంటిది. సవాళ్లకు ఎదురొడ్డి అత్యున్నత శిఖరాలకు చేరిన ముర్ము జీవితం యావత్ భారత మహిళలకు మార్గదర్శకం.