అమరావతి : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు. టీడీపీ కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పిస్తున్నారని తెలిపారు. ఆయన జీవితమంతా పోరాటంతోనే గడిచిపోయింది, అల్లూరి పోరాట పటిమ నేటియువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. బ్రిటీష్ వారితో పోరాడి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులను సమీకరించి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేశారని తెలిపారు. బ్రిటీష్ వారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని గుర్తుచేశారు. ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్ లను ముట్టడిరచి, ఆయుధాలను స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారన్నారు. ఆ కాలంలోనే అల్లూరి సీతారామరాజును బంధించి చంపడానికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాల్లో పోరాటం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారని కొనియాడారు. 27 సంవత్సరాల వయసులోనే బ్రిటీష్ వారు ఆయనను హతమార్చారని అంటూ అల్లూరి చేసిన పోరాటం అజరామరమని అన్నారు. జాతీయ స్థాయిలో ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదని, కేంద్రం 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ప్రధాని స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆయన త్యాగాల్ని గుర్తించి నివాళులర్పించడం సముచితమని అన్నారు. పార్లమెంటు లో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని గతంలో స్పీకర్ నిర్ణయించారు, దీన్ని ఆచరణలో అమలుచేయాలని చంద్రబాబునాయుడు విజ్జప్తిచేశారు.