సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న సిద్దాంతంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం,బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కోసం అన్న నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్దాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా నిలుస్తోంది కార్యకర్తలే. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు ఏర్పడినా అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా అధికారం,ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనుక్షణం తెలుగు ప్రజలకు సేవలందించగలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తలే. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తట్టుకుని, ఆస్తుల్ని, ఆప్తుల్ని సైతం పోగొట్టుకుని పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగం వెలకట్టలేనిది. కార్యకర్తల కష్టం, శ్రమతోనే నేటికీ పసుపు జెండా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెపరెపలాడుతోంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు టీడీపీ సొంతం. అలాంటి కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత. కన్నతల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలపై అదే ప్రేమను చూపిస్తుంది.
కార్యకర్తల సంక్షేమం గురించి మొదట ఆలోచించి అమలు చేసిన పార్టీ దేశంలో ఒక్క టిడిపి మాత్రమే. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల ప్రమాద బీమా అందించడం దేశంలో మొదటిసారిగా ప్రారంభించాం. ఆర్థిక సమస్యలతో కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోతే వారిని చదివిస్తున్నాం. అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందిస్తున్నాం. కార్యకర్తల బిడ్డల వివాహాలకు సాయం, జీవనోపాధికి అండ, సహజ మరణాల సందర్భంలోనూ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం. వాటితో పాటుగా కార్యకర్తలకు వారి పిల్లలకు స్వయం ఉపాధి కల్పించటం, కెరీర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అందించటం,వృతిపరమైన ఉద్యోగావకాశాలు కల్పించటం. అంతర్జాతీయ స్ధాయి ఉద్యోగాలు కల్పించటం వంటి వాటికి శ్రీకారం చుట్టాం. రక్త సంబందం లేకపోయినా కుటుంబ సభ్యుల్లా పార్టీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న కార్యకర్తలందరికీ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది.