హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలో మహిళలకి, బాలికలకి ఏమాత్రం రక్షణ లేదని మరోసారి నిరూపించబడిందని టీటీడీపీ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న అన్నారు. ఆమె మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు కనీసం ఏడుగురు చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని తెలియజేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గత మే నెలలో ‘మహిళా వేధింపులపై గళమెత్తుదాం’ అనే అంశంపై ట్రూకాలర్, న్యూస్-18 హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో ఆడబిడ్డలకు అగ్రపీఠం అని మాట్లాడారు. ఇదే సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో ఆరేళ్ల చిన్నారిపై టీఆర్‌ఎస్ నేత అత్యాచారం, నిర్మల్ మున్సిపల్ వైస్‌ఛైర్మన్ షేక్ సాజిద్ చేతిలో అన్యాయంగా బలైపోయిన అత్యాచారానికి గురైన బాలిక, నేడు హైదరాబాద్ నడిబొడ్డు అయిన జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం.. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల పసికందు మొదలుకొని 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు భద్రత లేదని అన్నారు.
జూబ్లీహిల్స్ దుర్ఘటన 28వ తేదిన జరిగితే 31వ తేదిన ఎఫ్‌ఐఆర్ నమోదు కావడమేమిటి? ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే వారు జూబ్లీహిల్స్‌లో జరిగిన అత్యాచార ఘటనపై 4వ తేది కావొస్తున్నా ఇంత వరకు సీసీ పుటేజీ దొరకలేదా? దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరం హైదరాబాద్ అని చెప్పుకుంటే సరిపోతుందా? నిన్న డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఘటనలో నిందితులు ఐదుగురు ఉన్నారని వారిలో ఇద్దరు మేజర్లు అని.. ముగ్గురు మైనర్లు అని చెబుతూ హోంమంత్రి కుటుంబానికి సంబంధం లేదని క్లీన్‌చిట్ ఇచ్చేశారు. బహుదూర్‌పుర ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ కూడా ఈ అత్యాచారంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. హోంమంత్రి మనుమడికి ఎలాంటి సంబంధం లేదని మాట్లాడిన వారు మిగతావారిని ఎందుకు దాచిపెడుతున్నారు? చంద్రబాబు హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నడిరోడ్డుపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే నో పోలీస్… అదే ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ఏదైనా ధర్నాలు చేయాలనుకుంటే మాత్రం పోలీసులు అత్యంత వేగంగా స్పందించి పని చేస్తున్నారు. ఊ.. అంటే ట్విట్టర్‌లో స్పందించే ట్విట్టర్ మంత్రి సిరిసిల్లలో ఆయన పార్టీ అనుచరుడు ఆరేళ్ల పసి మొగ్గను చిదిమేసినా స్పందించలేదు. మహిళలకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమని కేటీఆర్ ఎలా అంటారు?
2014లో పొక్సో చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులు 938 కాగా, 2021 సంవత్సరంలో అదే పొక్సో చట్టం కింద 2,567 కేసులు నమోదయ్యాయంటే 3 రెట్లు కేసుల నమోదు పెరిగాయి. ఇది మంత్రులకు చెంప పెట్టు కాదా? తెలంగాణ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం అనడానికి సిగ్గుందా? 2021లో 2,382 రేప్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. కష్టించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆడబిడ్డలుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనందుకు సిగ్గుపడుతున్నాం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏనాడూ హోంమంత్రి కానీ.. మహిళా మంత్రి కానీ నోరు మెదపరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులకు కారణం కేసీఆర్‌కు మహిళలపట్ల ఉన్న చులకనే. ఆయన మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు. బాల్యవివాహాల విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. షీ-టీమ్స్‌ను సంప్రదించాలంటే చాలా కష్టం.
పొక్సో కింద కేసు నమోదు అయితే దానికొక పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదైన కేసులలో ఒక ఎన్‌జీవో, ఒక మహిళా అధికారి, ఒక లీగల్‌కు సంబంధించిన వారు ఉండాలి. జూబ్లీహిల్స్ ఘటనలో వీరు ఉన్నారా? నిందితులను ఈ కేసులో మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదు? ఎవరిని కాపాడాలని చూస్తున్నారు?
జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనతోపాటు 2022 సంవత్సరంలో మహిళల అత్యాచారాలపై జరిగిన కేసులన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా విభాగం తరపున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిందితులను శిక్షించే విధంగా పోలీసులు పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ కలుగులోంచి బయటకు వచ్చి మహిళలను కాపాడాలని ప్రార్థిస్తున్నాం.
ఈ విలేకరుల సమావేశంలో తెలుగుమహిళా విభాగం రాష్ట్రపార్టీ ఉపాధ్యకక్షురాలు ఝన్సీలక్ష్మీ సూర్యదేవర, జయశ్రీ, చలసాని ఝాన్సీరాణి, ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి రెడ్డి, అధికార ప్రతినిధి కన్నెకోట లక్ష్మీ, కార్యనిర్వాహక కార్యదర్శులు అనురాధ, జ్ఞాన సుధ పాల్గొన్నారు.