అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర ఆర్థిక ప్రగతి, వినియోగదారుల సంతృప్తికి అనుగుణంగా రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ నడచుకుంటోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్ పాలసీ అమలు, నూతన ప్రతిపాదనలపై ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ, నూతన బార్ పాలసీలపై ఈ సమావేశంలో చర్చించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై వినియోగదారుల నుండి సానుకూల స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే మద్యం నాణ్యతపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాలలో అమలులో ఉన్న మైక్రో-బ్రూవరీ విధానాలపై కూడా కమిటీ కూలంకషంగా చర్చించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పాలసీ ద్వారా షాపులకు లైసెన్సు పొందిన వారు చట్టం ప్రకారం నడచుకోవాల్సిందేనని, ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. రాష్ట్ర ప్రగతికి, ఆర్థిక పురోగతికి ఎక్సైజ్ శాఖ కీలకంగా నిలుస్తోందని, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మరింతగా మెరుగైన అడుగులు వేయాలని అధికారులకు సబ్ కమిటీ సూచించింది.