- అనుమతుల మంజూరులో ఇబ్బందులు రావొద్దు
- ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించండి
- వేగవంతంగా యూనిట్ల స్థాపనకు చర్యలు చేపట్టాలి
- ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం
- నెలాఖరుకు మన మిత్ర ద్వారా అందుబాటులోకి 400 రకాల సేవలు
- సింగిల్ ప్లాట్‌ఫాం పైకి అన్ని ప్రభుత్వశాఖల యాప్‌లు, జీఓలు
- ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టిజిఎస్ అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశాలు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కొత్తగా తమ సంస్థలను ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చిన పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా, ఐటి హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తిచూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షిస్తూ ఇప్పటివరకు 91 ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయి, వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటుచేసేలా సంబంధిత కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటి, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు కీలకపాత్ర పోషిస్తాయి, రాబోయే అయిదేళ్లలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఐటి కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహక బకాయిలను వెంటనే చెల్లించండి. రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్‌మెంట్‌ను ఆధునీకరించండి. రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
పౌరసేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్‌లో..
ప్రభుత్వానికి సంబంధించిన పౌరసేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. నెలాఖరుకు 400రకాల సేవలకు విస్తరించండి. రెవిన్యూశాఖతో పాటు వివిధ రకాల సేవల సమయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి సర్టిఫికెట్ బ్లాక్ చెయిన్, క్యూఆర్ కోడ్‌తో నిర్ధారించుకునేలా టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయితీల్లో పన్నుల బకాయిల వివరాలు వాట్సాప్‌లో వచ్చేలా ఏర్పాట్లు చేయాలి, బకాయిలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ మెసేజ్‌లు పంపేలా చూడాలి. ఆర్‌టిజిఎస్‌కు సంబంధించి డేటా పాయింట్లు, కెపిఐలను ఇంటిగ్రేట్ చేయాలి. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలనకు సంబంధించి రియల్ టైమ్ సమాచారాన్ని ఆర్‌టిజిఎస్ లో పొందుపర్చాలి. సచివాలయం నుంచి గ్రామస్థాయి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను అనుసంధానం చేయండి. తుపానులు, వరదలు, పిడుగులు పడటం వంటి వాతావరణ సమాచారాన్ని రియల్ టైమ్‌లో అందించేలా చర్యలు తీసుకోండి. జూన్ 9,10 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయండి.
వివిధ శాఖలకు సంబంధించి సమాచారాన్ని అంతంటినీ ఏకీకృతం చేసి ఒక వెబ్ సైట్‌లో పొందుపర్చి ఏఐ ఎనేబుల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత సరళతరం చేసేలా చర్యలు చేపట్టాలి. వివిధ రకాల చిరు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలకు సంబంధించి సింగిల్ సర్టిఫికేషన్ ఉండేలా క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అనుసంధానించాలి. ప్రభుత్వానికి సంబంధించి అన్నిరకాల జిఓలు, యాప్‌లను సింగిల్ ప్లాట్ ఫాంపైకి తెచ్చి ఒకే వెబ్ సైట్‌లో అందుబాటులోకి తేవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటి అండ్ సి సెక్రటరీ కాటంనేని భాస్కర్, స్పెషల్ సెక్రటరీ బి.సుందర్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ సాయికాంత్ వర్మ, ఎపి టెక్నాలజీ సర్వీసెస్ ఎండి సూర్యతేజ్, ఆర్ టిజిఎస్ సిఇఓ ప్రకార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.