అమరావతి (చైతన్యరథం): భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పెద్ద ఎత్తున నేతలు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఎందరో త్యాగమూర్తుల పోరాటాల ఫలితంగానే నేడు భారత ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. భారతీయులందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్.. రాజ్యంగ పరిరక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలిపడమే లక్ష్యంగా, దేశంలోనే బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యంగం నడిచిందని.. నేడు కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తోందన్నారు.
బాబా సాహెబ్ అంబేద్కర్ కలలను నిజం చేసేందుకు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం పని చేస్తున్నారని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేసి అసమానతలు రూపు మాపి అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందేలా నాడు బాబాసాహెబ్ రాజ్యంగాన్ని రూపొందిస్తే.. గత పాలకులు దాన్ని పూర్తిగా విస్మరించి సొంత రాజ్యంగంతో బడుగు బలహీన వర్గాలను, పేదలను పాతాళంలోకి తొక్కి, వారి అభివృద్ధిని అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. నేడు రాజ్యంగ శిల్పి అంబేద్కర్ సంకల్పాన్ని నేరవేర్చడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని నేతలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, టీడీపీ సీనియర్ నాయకులు ఏవీ రమణ, బ్రాహ్మణ సాధికార సమితి కన్వినర్ బుచ్చిరాంప్రసాద్, అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, రిసెప్షన్ కమిటీ సభ్యులు పర్చూరి కృష్ణ, హాజీ హసన్ బాషా, నేతలు దేవినేని శంకర్ నాయుడు, కనకాచారి, దామోదర్, చెన్నుపాటి గాంధీ, మైనార్టీ కార్యదర్శి మహ్మద్ నూర్, డాక్టర్ సోయబ్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.