- అత్యంత అరుదైన గౌరవం
- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో పేరు నమోదు
- ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ నటుడు
- కెరీర్ ఆర్ద శతాబ్దం దాటినా అగ్రనటుడిగానే
- అన్ని జానర్లలో నటించిన ఏకైక హీరో
హైదరాబాద్ (చైతన్యరథం): ధీóరోదాత్త హీరోయిజానికి మరోపేరు. తూటాల్లాంటి మాటలతో థియోటర్ల టాప్ లేపే స్టార్‌డమ్‌కి కేరాఫ్ అడ్రస్స్. రికార్డుల మొనగాడు. బాక్సాఫీస్ రారాజు. మాస్ అనే పదానికి పర్యాయపదం. ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నా అవన్నీ గాడ్ ఆఫ్ మాసెస్.. బాలయ్యకు సొంతం! ఆయన ఖ్యాతి ఇప్పుడు దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.
నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదైంది. భారతీయ సినిమాలో 50 సంవత్సరాల పాటు హీరోగా నటించి మెప్పించినందుకు బాలకృష్ణ పేరుని యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో చేర్చుతున్నట్లు దాని నిర్వాహకులు లేఖ ద్వారా తెలియజేశారు. భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆ రికార్డ్ సాధించిన ఏకైక నటుడు మన బాలయ్యే. 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటికీ అగ్రహీరోగా కొనసాగుతుండడం విశేషం.
సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య 5 దశాబ్దాల సినీ ప్రస్థానం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం అని ఆయన కొనియాడారు. యాభై ఏళ్ళుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ నేటికీ బాలయ్యలో అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. నేటికీ సూపర్ హిట్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు రెండు మూడేళ్ళకు ఓ సినిమా చేస్తుంటే బాలయ్య మాత్రం ఇక నుంచి ఏడాదికి మూడు సినిమాలు చేస్తానని చెప్పారు.
అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడు..
1974లో ‘తాతమ్మ కల’తో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మగారి మనవడు, సీతారామకల్యాణం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, అఖండ.. ఇలా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాలు అందుకున్నారు. 1000కి పైగా రోజులు ప్రదర్శితమై ‘లెజెండ్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్.. ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడిగా బాలయ్య రికార్డు సృష్టించారు.
అటు జాతీయ అవార్డు.. ఇటు రికార్డు
సినీ, సామాజిక రంగాలకు చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణ కొన్ని నెలల క్రితం స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన నటించిన భగవంత్ కేసరి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా వాణిజ్యపరంగా కూడా విజయవంతమై ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో.. ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (డబ్ల్యూబీఆర్), యూకే, యుఎస్‌ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, యుఏఇతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు డబ్ల్యూబీఆర్ గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతోంది.
ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్రకి లభించిన గౌరవంగా నిలుస్తుంది. 50 సంవత్సరాలు అగ్ర హీరోగా కొనసాగటం అద్భుతమైన మైలురాయి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో కూడా అత్యంత అరుదైన ఘనతగా నిలుస్తుంది. తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని కొనసాగిస్తూనే టాలీవుడ్‌లో తన ఆల్‌రౌండ్ పతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన ప్రత్యేక గుర్తింపును బాలకృష్ణ సాధించుకున్నారు. 60 దాటినా తగ్గని ఉత్సాహం, క్రమశిక్షణ, కళాత్మకమైన నటన అన్నితరాల సినిమా ప్రేమికులను ఆయనకు అభిమాన పాత్రులను చేసింది.
అందరు కళాకారుల మాదిరిగానే బాలకృష్ణ కూడా తన మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఆయన స్థిరచిత్తం, ధైర్యం, విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమలో ఆయనను విజేతగా నిలిపాయి.
బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్భుతమైన హ్యాట్రిక్ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు, ప్రజల విశ్వాసం, ప్రేమను మరోసారి గెలుచుకున్నారు. నిబద్ధత, డైనమిక్ లీడర్‌షిప్‌తో హిందూపూర్ రూపురేఖలు మార్చడమే కాకుండా దానిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించారు.
ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలను గౌరవిస్తూనే నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం, ఒక ప్రముఖ నటుడి ప్రస్థానంగా మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
బాలకృష్ణ గొప్పతనం సిల్వర్ స్క్రీన్‌ను దాటి ప్రజా సేవలో ఎంతగానో విస్తరించింది. గత 15 సంవత్సరాలుగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్‌గా అభాగ్యులకు వైద్యసేవలు అందించటాన్ని ఒక ఉదాత్త కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. మోడువారిన ఆశలను చిగురింపజేస్తూ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించటం, నిరుపేదలకు కరుణతో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడం… ఆయన మానవతావాదానికి అద్దం పడుతుంది. ఇటు కళారంగంలో అద్వితీయ ప్రతిభ.. అటు విస్తృత సామాజిక సేవ ఒక అరుదైన కలయిక. నటసింహం నందమూరి బాలకృష్ణకు డబ్ల్యూబీఆర్ గోల్డ్ ఎడిషన్‌లో గుర్తింపు లభించటం..అర్ధ శతాబ్దానికి పైగా స్టార్‌డమ్‌ను పునర్నిర్వచించిన ఐకానిక్ నటుడికి దక్కిన అపూర్వ గౌరవం. నటన, ప్రజా జీవితంలోనే కాకుండా ఆరోగ్య రంగంలో కూడా అనితర సాధ్యమైన సేవలందిస్తూ సామాజిక సేవలో ఛాంపియన్‌గా నిలిచిన నాయకుడు ఆయన. తరాలను స్ఫూర్తిమంతం చేసే సాంస్కృతిక రాయబారి.