అమరావతి (చైతన్యరథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలపై 50 శాతం డిస్కౌంట్‌తో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మూడో బ్లాక్‌లో ఉన్న ఆప్కో షోరూమ్ లో చేనేత వస్త్రాలపై 50 శాతం తగ్గింపు ధరల ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆప్కో షో రూమ్‌లో వస్త్రాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణి చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్బంగా మంత్రులు సవిత, గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాల కొనుగోలుపై 50 శాతం మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డిస్కౌంట్ విక్రయాలను మూడు రోజుల పాటు గురు, శుక్రవారాలు సహా ఈ నెల పదో తేదీ సోమవారం సాయంత్రం వరకు చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. చేనేత వస్త్రాలను వారానికోసారి ధరించుదామని, నేతన్నలకు అండగా ఉందామని మంత్రి సవిత పిలుపు ఇచ్చారు.