- ఇప్పటికి 10 ఎస్ఐపీబీలు నిర్వహించాం
- రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం
- లాజిస్టిక్స్ రంగమే రాష్ట్రానికి చోదకశక్తి
- జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత
- వచ్చే ఏడాదికి కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టులు
- మౌలిక సదుపాయాల కల్పనకు బ్లూ ప్రింట్
- పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాం..
- ఇకపై విశాఖపట్నం నాలెడ్జ్ సిటీ
- ఏపీ బ్రాండ్ను పునరుద్ధరించి విస్తరిస్తున్నాం
- పెట్టుబడులు, ఉద్యోగాలు, లాజిస్టిక్స్పై సీఎం చంద్రబాబు
- ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి సుదీర్ఘ సమాధానం
అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల కాలంలో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో కలిపి మొత్తంగా ఈ ఉద్యోగాలు కల్పించామని… 20 లక్షల ఉద్యోగాల కల్పన సాధన దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో లాజిస్టిక్స్, పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగాల వివరాలతోపాటు… మౌలిక వసతుల కల్పన… లాజిస్టిక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను సీఎం వివరించారు. “మెగా డీఎస్సీ ద్వారా 15941, వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తంగా కలిపి 9093, పోలీస్ శాఖలో 6100 మందికి ఉద్యోగాలు కల్పించాం. స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వర్క్ ఫ్రం హెూంద్వారా 5500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ప్రయివేట్ రంగంలో మొత్తంగా 3,48,891 మందికి ఉద్యోగాలను ప్రైవేట్ సెక్టారులో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ, ఎంఎంస్ఎంఈలు, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో కల్పించాం. తాము కల్పించిన ఉద్యోగాల వివరాలను పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతాం. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉద్యోగం పొందారు, ఏ జాబ్ చేస్తున్నారు? అనే సమస్త వివరాలను పోర్టల్ ద్వారా వెల్లడిస్తాం. గత పాలకులు ఐదేళ్లకాలంలో కేవలం 13 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 10 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు జరిగాయి. తద్వారా రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6.29 లక్షలమందికి ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే గత ప్రభుత్వం సాధించిన దానికంటే మూడురెట్లు ఎక్కువ పెట్టుబడులు సాధించాం. 125 ప్రాజెక్టుల్లో రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ, భారత్ పెట్రోలియం, ఎల్జీ, ఐబీఎం, టీసీఎస్, గూగుల్, ఎన్టీపీసీ, రిలయన్లాంటి ప్రతిష్టాత్మ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
లాజిస్టిక్స్ అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్
“లాజిస్టిక్స్ రంగం గురించి గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మాట్లాడలేదు. భవిష్యత్తులో లాజిస్టిక్స్ కల్పనతో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణాలాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలి. భారత్ దేశంలో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లుగా ఉంది. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతం. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 శాతం మేర వాటా కలిగి ఉంది. లాజిస్టిక్స్కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఇది ఉత్పత్తి దారులకు, వినియోగదారులకూ ప్రయోజనం చేకూరుస్తుంది. వస్తు రవాణాకు తూర్పు కోస్తాతీరంలోవున్న ఏపీ ఓ కీలక ప్రాంతం. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎకో సిస్టంలో రైలు, రోడ్డు, జల రవాణాతోపాటు పైడ్లైన్ మార్గం కూడా కీలకంగా మారింది. పైడ్లైన్ ద్వారా గ్యాస్, నీరులాంటివి రవాణా చేసేందుకు ఆస్కారముంది. మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టు సిస్టం ద్వారా హైయ్యర్ కార్గో రవాణా చేస్తే వ్యయం తక్కువవుతుంది. ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయి. లాజిస్టిక్స్. ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని కోసం ఓ బ్లూ ప్రింట్ తయారు చేసి వ్యయం తగ్గించటమే లక్ష్యంగా పని చేస్తాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
గుంతలు పూడ్చాం…
జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం
“గత ప్రభుత్వ హయాంలో గుంతలుపడిన రోడ్లకు అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాం. పోర్టులను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించేందుకు చేపట్టిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ దేశానికే మణిహారంగా నిలిచింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 14,966 కిలోమీటర్ల రహదారులను రూ.4500 కోట్లతో త్వరలోనే చేపడతాం. జాతీయ రహదారులు రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. జాతీయ రహదారుల విషయంలో దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉంది. రాష్ట్రంలో ప్రతీ 1000 చదరపు కిలోమీటర్లకు 53 కిలోమీటర్ల మేర జాతీయ తహదారులు ఉన్నాయి. ప్రతీ లక్షమందికి 17 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రంలో ఉన్నాయి. హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధిని మరోస్థాయికి తీసుకెళ్తాయి. హైదరాబాద్- అమరావతి- చెన్నై-బెంగుళూరు నగరాలను కలుపుతూ ఎలివేటెడ్ హైస్పీడ్ కారిడార్ (బుల్లెట్ ట్రైన్) ప్రాజెక్టు రానుంది. విశాఖ రైల్వే జోన్ ప్రాజెక్టును కూడా కూటమి ప్రభుత్వం వచ్చాకే భూమి ఇచ్చి ప్రారంభింపచేశాం. దీనికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. గత ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించి ఇబ్బందులు తెచ్చింది. నేషనల్ హైవేలు, రైల్వే స్టేషన్ల ప్రాజెక్టులపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా శ్రద్ద పెట్టాలి. అవి మనవి కావని అశ్రద్ధ చేయొద్దు. వీటివల్ల స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. రూ.2.5 లక్షల కోట్లమేర లాజిస్టిక్స్పై ఖర్చు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వచ్చే ఏడాదికి కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టులు సిద్ధం
“1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతంలో ఒక మేజర్ పోర్టు ప్రస్తుతం ఉంది. 5 ఆపరేషనల్ నాన్ మేజర్ పోర్టులు రాష్ట్రంలో ఉన్నాయి. 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం 182 మిలియన్ టన్నుల కార్గోను మన పోర్టులు హ్యాండిల్ చేస్తున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చే 4 పోర్టులు మరో 100 మిలియన్ టన్నుల కార్గోను రవాణా చేసేందుకు ఆస్కారముంది. దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ సెంటర్ రాబోతోంది. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు వచ్చే ఏడాదినాటికి అందుబాటులోకి వస్తాయి. అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా పెద్దఎత్తున కార్గో రవాణాకు ఆస్కారం ఉంది. కాకినాడ, ఏలూరు కాల్వలను అనుసంధానిస్తే అంతర్గత జలరవాణా మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులున్నాయి. గత ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టును పక్కన పెట్టేసి ప్రాజెక్టును వదిలేసింది. 2026 ఆగస్టునాటికి భోగాపురం ఎయిర్ పోర్టు ఆపరేషనల్ ఎయిర్పోర్టుగా మారుతుంది. అక్కడే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రం కూడా వస్తుంది. తద్వారా ఉత్తరాంధ్రకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎయిర్ పోర్టు నెట్వరున్ను విస్తరించటం ద్వారా లాజిస్టిక్స్ కనెక్టివిటీని పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం, అమరావతి ఎయిర్ పోర్టు నిర్మిస్తాం. అలాగే రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, ఒంగోలు, తుని, శ్రీకాకుళంలోనూ ఎయిర్పోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో సరకు నిల్వల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుపై బ్లూప్రింట్ తయారు చేస్తున్నాం. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఇన్ ల్యాండ్ వాటర్, వేర్ హౌసింగ్ ఇలా వేర్వేరు మౌలిక సదుపాయాలను కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తాం. లాజిస్టిక్స్ అంశంలో ప్రతిష్టాత్మక మెర్స్ అండ్ మార్క్స్ సంస్థ ఏపీకి సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం 3 లక్షలమంది ఎలాంటి శిక్షణ లేకుండానే లాజిస్టిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. అలాగే లాజిస్టిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ను కేటాయించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఏవియేషన్ రంగంలోనూ ఒక యూనివర్సిటినీ విశాఖలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఏరో స్పేస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎనర్జీ, అగ్రో ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లైఫ్ సైన్సెస్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించాం” అని చంద్రబాబు వెల్లడించారు.
ఉద్యోగాలిస్తుంటే అడ్డుకుంటున్నారు
“ఆటోమొబైల్ రంగంలో కియాలాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో కార్లు ఉత్పత్తి చేస్తోంది. 2014-19 మధ్య కియా కార్లను ఉత్పత్తి చేయటంతోపాటు ఓ మోడల్ టౌన్షిప్ను కూడా అభివృద్ధి చేసింది. ఇసుజు, హీరోమోటార్లాంటి సంస్థలు టీడీపీ హయాంలోనే ఏపీకి వచ్చాయి. గత పాలకులు కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలు ఏపీకి వస్తే…వాటిని వేధించి పెట్టుబడులు పెట్టకుండా ఇతర
రాష్ట్రాలకు పారిపోయేలా చేశారు. జాకీ సంస్థను రాష్ట్రం నుంచి తరిమేశారు. 2019–24 మధ్య పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేకుండా పోయింది.
పీపీఏలు రద్దు చేశారు. గత ప్రభుత్వ వైఖరితో దేశ ప్రతిష్ట దెబ్బతింది. ఇదే విషయాన్ని నాడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. పీపీఏల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రం చెప్పినా… నాటి పాలకులు వినలేదు. విద్యుత్ వినియోగించుకోకపోయినా ఆ కంపెనీలకు ఉత్తి పుణ్యాన చెల్లించాల్సి వచ్చింది. ప్రజాధనం దుర్వినియోగమైంది. సింగపూర్ వాళ్లనూ ఇబ్బంది పెట్టారు. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. ఏపీపై నమ్మకం పోయేలా గత పాలకులు వ్యవహరించారు. ఇక యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నా.. అదేవిధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మందికి ఉద్యోగాలిస్తూ నియామక ఉత్తర్వులు ఇచ్చాం. మెగా డీఎస్సీని ఆపడానికి 150 పిటీషన్లను వేసి అడ్డంకులు సృష్టించారు. మొత్తం పారదర్శకంగా నియామకాలు జరిగాయి. ఇప్పటికి 14సార్లు డీఎస్సీ నిర్వహించాం. ప్రతీ మూడు నెలలకు ఓసారి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జాబ్మేళాల ద్వారా ఉద్యోగాలు యువత పొందుతున్నారు. ఇప్పటి వరకూ 1304 జాబ్ మేళాలు జరిగాయి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుకున్న వారికి 94 శాతంమందికి ప్లేస్మెంట్లు దక్కాయి. రాష్ట్రంలో 3.5 కోట్లమందికి నైపుణ్యాలపై అధ్యయనం చేస్తున్నాం. స్కిల్ డెవల్మెంట్ కార్పోరేషన్ ద్వారా జాబ్మిళాలు నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దీనిపై శ్రద్ధ పెట్టాలి. నాలెడ్జ్ ఎకానమీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది” అని సీఎం చంద్రబాబు ఉద్బోధించారు.
పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచాం
“ఇప్పుడు మళ్లీ ఏపీపై విశ్వాసాన్ని పెంపోందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పెట్టుబడులు పెట్టాక అదిరాష్ట్ర ప్రాజెక్టుగా భావించి త్వరితగతిన అనుమతులిచ్చి వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తున్నాం. వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర లక్ష్యంగా విజన్ రూపొందించాం. 2.4 ట్రిలియన్ ఎకానమీ, 450 బిలియన్ ఎగుమతులు, తలసరి ఆదాయంలాంటి లక్ష్యాలను పెట్టుకున్నాం. అలాగే వందశాతం అక్షరాస్యత, 95 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులను సాధించటంలాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుగుణంగా పాలసీలు తెచ్చాం. అమరావతిని గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు వస్తే నీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నీటిభద్రత విషయంపైనా దృష్టి పెట్టాం. ఈ లక్ష్యాల సాధనకు ఏం చేయాలన్న దానిపైనా ప్రణాళికలు సిద్ధంచేసుకున్నాం. ప్రొడెక్టు పర్ఫెక్షన్ నుంచి సర్క్యులర్ ఎకానమీ వరకూ వివిధరంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇకపై విశాఖ నాలెడ్జ్ సిటీ
“విశాఖలో రూ.1కి భూమిఇస్తామంటే కొందరు వ్యతిరేకించారు. ఏడాదిలోనే టాప్ రేటెడ్ కంపెనీలు వస్తున్నాయి. 6 బిలియన్ డాలర్ల వ్యయంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. పోర్టు సిటీ, స్టీల్ సిటీనుంచి నాలెడ్జ్ ఎకానమీ సిటీగా విశాఖ రూపురేఖలు మారబోతు న్నాయి. ఎకనామిక్ కారిడార్లు, పారిశ్రా మిక క్లస్టర్లలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పెట్టుబడులు రాబోతున్నాయి. టూరిజానికి పారిశ్రామిక హెూదానిచ్చి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఎక్కువమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానం రూపోందించాం. కారావాన్, హెంప్టేల ద్వారా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50వేల హెూటల్ రూముల నిర్మాణం చేపట్టేలా చర్యలు చేపట్టాం. దసరా అంటే కలకత్తా, మైసూరు లాంటి పట్టణాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు ఆ నగరాల సరసన విజయవాడను చేర్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రివర్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్లను ఏర్పాటు చేయబోతున్నాం.
ఎకో టూరిజంతోపాటు బీచ్ టూరిజం, టెంట్ సిటీల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టాం. రాష్ట్రంలో 100 ఎక్సపీరియన్స్ సెంటర్లను అభివృద్ధిచేస్తున్నాం. 21 ప్రసిద్ధ ఆలయాలను అభివృద్ధిచేస్తున్నాం. శ్రీశైలం దేవస్థానానికి త్వరలోనే ప్రధాని మోదీ రాబోతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఏపీని అభివృద్ధి చేస్తున్నాం. 2029-30నాటికి 160 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్నాం. ఈ రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేం దుకు మంత్రుల కమిటీని నియమించాం. స్ట్రాటజిక్ క్లస్టర్ల ద్వారా వివిధ రంగాల పరిశ్రమల్ని ఆకట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా”మని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కుటుంబానికో పారిశ్రామికవేత్త
“క్వాంటం వ్యాలీ అమరావతి 2026 జనవరినాటికి సిద్ధమవుతుంది. వచ్చే రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే స్థితికి ఏపీ వస్తుంది. రాష్ట్రంలో 3 సెంట్రల్ యూనివర్సిటీలు, 20 అటానమస్, 255 ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీని ఓ నాలెడ్జి హబ్ … ఫ్యూచర్ ఎకానమీకి కేంద్రంగా తయారు చేసుకుంటున్నాం. గవర్నెన్సు 4.0 స్టేట్ డేటా లేక్ తో ప్రభుత్వ విభాగాలను అనుసంధానించి పౌరసేవ లను సులభంగా అందేలా చేస్తున్నాం. 734 సర్వీసులు వాట్సాప్ ద్వారా అంది స్తున్నాం. వీటితోపాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం. వన్ ఫ్యామిలి, వన్ ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా పని చేస్తున్నాం. వీటన్నిటితో హెల్దీ, వెల్దీ హ్యాపీ ఏపీని ఆవిష్కరిస్తాం. ఏడాదిలో మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్ధిక వ్యవస్థగా భారత్ మారుతోంది. సంస్కరణల్ని, అవకాశాల్ని వినియోగించుకుని… సంపద సృష్టించాం. మంచి పబ్లిక్ పాలసీ వస్తే కోట్లాది జీవితాలు మారతాయి. యువ ఎమ్మెల్యేలు ఈఅంశాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పాలసీలు రూపోందించడం లో భాగస్వాములు కావాలి” అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.