- ఏపీ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
- ‘జల్ జీవన్’ రూ. 5 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ
- విద్యుత్ ఛార్జీల ట్రూ అప్ భారం భరించేందుకు ఆమోదం
- సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఓకే
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు
అమరావతి (చైతన్యరథం): ఏపీ లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దాదాపు 35కు పైగా అజెండా అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇటీవల జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు పచ్చజెండా ఊపారు. వివిధ సంస్థల భూ కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సీఆర్డీయే అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రిమండలి ఓకే చెప్పింది. గత ప్రభుత్వం వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునేలా క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అభివృద్ది, సంక్షమ పథకాలను సమర్థ అమలు కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం వీటికి ఆమోదముద్ర వేసింది.
45 ఎంఎస్‌ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లు
ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ప్రతిపాదించిన క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పథకానికి ఆమోదం తెలిపింది. రూ.200 కోట్ల మొత్తం బడ్జెట్ కేటాయింపుతో రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో కనీసం 45 ఎంఎస్‌ఎంఈ కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది. కొత్తగా ప్రారంభించిన 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో ఈ క్లస్టర్లకు ప్రాధాన్యత ఇస్తారు. వీటితో పాటు పరిశ్రమలు, ఇంధన శాఖల్లో పలు సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటన సహా రాయితీలు, ఇస్తూ తీర్మానించింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలు కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్.. ఏపీ జల్ జీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కు మంజూరు చేసిన రూ.5 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.
కార్పొరేషన్ వనరుల సమీకరణ పరిమితిను రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెంచడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు, పట్టణ స్థానిక సంస్థలు మరియు పరిశ్రమలకు శుద్ధి చేసిన తాగునీటి అందుబాటు మెరుగుపడనున్నట్లు మంత్రి వర్గం తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు బలైన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు కె. లలిత్ ప్రసాద్‌కు పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు.
బార్లపై అదనంగా విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ కిట్‌ల సేకరణ, సరఫరాకు మొత్తం రూ.944.53 కోట్ల చెల్లింపులకు పరిపాలనా ఆమోదానికి అంగీకారం తెలిపింది. గత ప్రభుత్వ కొనుగోలు ఆర్డర్‌లకు ఆర్థిక సమ్మతి లేకుండా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపు కల్పన జరగ్గా దీన్ని ఆమోదించింది. ఎస్సీలకు ఆర్థిక సహాయ పథకాలు, ఇతర సంక్షమ మానిఫెస్టో పథకాలు, వాగ్దానాలను ఎస్సీ లబ్ధిదారులకు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.1,500 కోట్ల రుణ మొత్తాన్ని మంజూరు చేయడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాజధాని అమరావతిలో ‘‘ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణం, ఎక్స్‌టర్నల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇంటర్నల్ రోడ్లతో సహా’’ పనికి రూ.165.33 కోట్ల మొత్తానికి పరిపాలనా ఆమోదం కల్పించడానికి అనుమతి ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదించిన మొత్తాన్ని డిస్కామ్‌లకు ఆరు నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించడం ద్వారా ట్రూ అప్ భారాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మునిసిపల్ కార్పొరేషన్ పరిమితులకు చుట్టూ 5 కి.మీ. పరిధి బెల్ట్‌లో, నిర్దేశిత పర్యాటక కేంద్రాలలో 3-స్టార్, అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రోబ్రూవరీలను అనుమతించడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం కోటబొమ్మాళిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. కుష్టు వ్యాధి ప్రభావితులైన ప్రజల పట్ల వివక్షను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్‌ను సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది. ముసాయిదా బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర శాసనసభ ముందు ఉంచడానికి అనుమతి ఇచ్చింది.













