ఢిల్లీ: భారత్‌లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య ఏటికేడు పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగా విమానాలను సైతం ఆయా సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పైలట్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమవుతారని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాబోయే 15-20 ఏళ్లలో సుమారు 30వేల మంది పైలట్లు అవసరం పడతారని పేర్కొన్నారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు ఆయన మాట్లాడారు. దేశీయంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 6,7 వేల మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ కంపెనీలు 1700కు పైగా విమానాలకు ఆర్డర్ పెట్టాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అవి సేవలందించబోతున్నాయన్నారు. దీంతో రాబోయే 15-20 ఏళ్లలో 30 వేలమంది పైలట్లు అవసరమని చెప్పారు. భారత్‌ను టైనింగ్ హబ్‌గా కూడా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. విమానయాన పరిశ్రమ కోసం మంత్రిత్వ శాఖ ఒక సమష్టి విధానంతో పనిచేస్తోందని చెప్పారు. 38 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లను తనిఖీ చేసి అధికారులు రేటింగ్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు.